ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, మద్యపాన నిషేధం కోసం జగన్ అనుసరిస్తున్న విధానాలపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. మద్యపాన నిషేధం పేరుతో జగన్ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని నాసిరకం బ్రాండ్ లను ఏపీలో అమ్ముతున్నారని, ఆ నాసిరకం బ్రాండ్లు వైసీపీ నేతలకు చెందిన బినామీ కంపెనీలలోనే తయారవుతున్నాయని విమర్శిస్తున్నారు.
మద్యం వ్యాపారంలో ఇప్పటికే రూ.25 వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ మద్యపాన నిషేధంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. బైబిల్ లోని వాక్యాలను ఉటంకిస్తూ జగన్ పై పవన్ విమర్శనాస్త్రాలు సంధించారు..రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్…సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు తయారయ్యారని చురకలంటించారు.
‘‘ సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే.. సామెతలు 12:22 అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు’’ అంటూ పవన్ వ్యంగ్యంగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అంతకుముందు, జగన్ మద్యపాన నిషేధంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మరో ట్వీట్ చేశారు. ‘‘సంపూర్ణ మద్యపాన నిషేధం అనగా మద్యం ఆదాయం రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచుట !! ఆ రాబడి చూపించి రూ.8 వేల కోట్ల బాండ్లు బజార్లో అమ్ముట ! ఇదీ ‘స్పిరిటెడ్ విజనరీ’ @ysjagan గారి మేనిఫెస్టో అమలు.JACKPOT ! #SpiritedVisionary_Jagan’’అంటూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని జోడిస్తూ నాదెండ్ల ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను పవన్ కోట్ చేస్తూ జగన్ పై సెటైర్లు వేశారు. మరి, పవన్ సెటైర్లపై వైసీపీ నేతల రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.