మీ చిన్నారులు జాగ్రత్త. తల్లిదండ్రులూ! మీ బంధువులు అయినా సరే ! మీరు ఎవ్వరినీ నమ్మవద్దు.
ముఖ్యంగా మీ పిల్లలకు గుడ్ టచ్-కు, బ్యాడ్ టచ్-కు ఉన్న తేడా ఏంటన్నది చెబుతూ ఉండండి అని తరుచూ పోలీసులు, మానసిక వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు.
కానీ ఇక్కడ కాపాడాల్సిన వాడే వావి వరసలు మరిచి మృగంలా ప్రవర్తించాడు. మరి! ఆ వలంటీరుకు తగిన శిక్ష పడుతుందా? ఆ వివరం ఈ కథనంలో ..
పవిత్రం అయిన ఉద్యోగం.. అందరినీ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఉద్యోగం.. వలంటీరు అంటే జగనన్న సైనికుడు ఇంకా చెప్పాలంటే ప్రజలకు సేవకుడు.
కానీ ఆ నీఛుడు ఆ అర్థమే మార్చేశాడు. వికృతం చూపించి ఆరేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించాడు.
మూడు నెలల కిందట జరిగిన ఈ ఘటన తాజాగా చిన్నారి పెదవి విప్పడంతో వెలుగు చూసింది.
ఆఖరికి వలంటీరు వికృత పోకడలకు హడలి పోయి పోలీసులను ఆశ్రయించిన బాధితులకు ఇప్పుడొక అనుకోని ఘటన ఎదురైంది. కేసు నమోదయినా నిందితుడు మాత్రం పరారైయ్యాడు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, 18వ డివిజన్లో ఓ వలంటీరు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఇప్పటిదాకా దిశ యాప్ ద్వారా ఆడబిడ్డలందరికీ రక్షణ ఇస్తున్నాం అని చెబుతున్న వైసీపీ వర్గాలు తాజా ఉదంతంతో ఉన్న పరువు పోయిందని, ఇటువంటి వారు ఎవ్వరైనా సరే క్షమించవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక్కడ పనిచేస్తున్న మున్నుల శ్రావణ్ కుమార్ పై వస్తున్న ఆరోపణలు, నమోదైన ఫిర్యాదుల కారణంగా ప్రస్తుతం ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు.
దిశ పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదు అయింది. అసలేం జరిగింది అంటే?
ఆస్పత్రి పాలయైన తమ బంధువును పరామర్శించేందుకు బయలుదేరిన ఓ జంట మార్గ మధ్యలో తమ పాపను వలంటీరుకు అప్పగించారు. ఆ వలంటీరు వారికి మేనమామ కొడుకు అవుతాడు.
ఆరేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లడం ఎందుకు పరామర్శించి వచ్చాక, పాపను శ్రావణ్ దగ్గర నుంచి ఇంటికి తీసుకుని పోవచ్చు అనే సదుద్దేశంతో వాళ్లిద్దరూ ఆయన్ను నమ్మారు. కానీ శ్రావణ్ మాత్రం ఆ చిన్నారిని లైంగిక వేధింపులకు గురిచేశాడు.
ఆ తరువాత ఆ చిన్నారి శ్రావణ్ కనిపించిన ప్రతిసారీ భయంతో వణికిపోవడం మొదలుపెట్టింది.
దీంతో విషయం ఆరా తీస్తే అసలు గుట్టు బయటపడింది. ఆయన వికృత ప్రవర్తన కారణంగా లైంగిక వేధింపులకు తమ బిడ్డ గురైందని గుర్తించి, వెంటనే దిశ స్టేషన్ను ఆశ్రయించారు బాధితులు.
పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతలో విషయం తెలుసుకుని వలంటీరు శ్రావణ్ కాస్త పరారీ అయ్యాడు.