ఘోర బస్సు ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. ఈ దారుణ యాక్సిడెంట్ జరిగింది కర్ణాటకలో అయినా.. అందులోని బాధితులు మొత్తం హైదరాబాద్ కు చెందిన వారన్నది ప్రాథమిక సమాచారం.
పుట్టిన రోజు పార్టీ కోసం గోవాలో ప్లాన్ చేయగా.. అక్కడకు వెళ్లి తిరిగి వస్తున్న వేళ ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
కర్ణాటకలోని కలబురిగి జిల్లా కమలాపురంలో గూడ్స్ లారీని.. ‘ఆరెంజ్’ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు బలంగా ఢీ కొంది.
అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో.. రెప్పపాటులో అదుపు తప్పిన బస్సు ఒక గుంతలో బోల్తా పడింది.
ప్రమాద సమయంలో బస్సు కల్వర్టులో మీద ప్రయాణిస్తుండగా.. కల్వర్టు మీద నుంచి 50 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోవటంతో డీజిల్ ట్యాంకు పేలిపోయి.. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
నిమిషాల వ్యవధిలో బస్సు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు.
మరో 27 మంది గాయపడ్డారు.
మరణించిన వారిలో హైదరాబాద్ కు చెందిన ఐటీ ఇంజనీర్ అర్జున్ కుమార్ (37).. అతని సతీమణి (32).. బివాన్ (4).. దీక్షిత్ (9).. అనితా రాజు (40).. శివకుమార్ (35).. రవళి (30) ఉన్నారు. మరొకరు ఉన్నా..వారి వివరాలు బయటకు రాలేదు. బర్త్ డే వేడుక కోసం రెండు కుటుంబాలకు చెందిన 32 మంది గోవాకు వెళ్లారు.
అర్జున్ కుమార్ బస్సును బుక్ చేసి వస్తున్నట్లు చెబుతున్నారు.
మరణించిన వారిలో 21 మందిఒక కుటుంబానికి చెందిన వారు కాగా.. మరో కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గోవాకు వెళ్లి.. అక్కడ వేడుకలు ముగించుకొని బస్సు తిరిగి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిన బస్సులో.. డ్రైవర్.. ఇద్దరు సహాయకులు మొత్తం35 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి.. గాయపడిన వారిని దగ్గర్లోని కలబురిగి పరిధిలో ఉన్న మూడు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించినట్లుగా తెలుస్తోంది. మరణించిన వారంతా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు చెందిన వారిగా చెబుతున్నారు.
వీరికి సంబంధించిన పేర్లు బయటకు వచ్చినా.. వారు నగరంలోని ఏ ప్రాంతానికి చెందిన వారన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు.