బాపట్ల ఎమ్మెల్యే మరియు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి చుక్కలు చూపించారు ఆ ప్రాంత వాసులు. పాపం ఆయన సర్దిచెబుతున్నా వినిపించుకోకుండా మాములుగా కాదు ఓ రేంజ్ లో ఆయనతో వాగ్వాదానికి దిగారు. కొంచెం శాంత స్వభావి కావడంతో ప్రజలు ఏమన్నా కూడా నవ్వుతూ సమాధానాలు చెప్పడం తప్ప ఏమీ చేయలేకపోయారు. అవన్నీ మర్చిపోండి వచ్చే ఎన్నికల్లో మళ్లీ మాకే ఓటు వేయండి అని చెబుతూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముందుకు సాగించారు.
ఏం చెప్పి వచ్చారు.. ఏం చేశారు..అని మహిళలు నిలదీశారు. అసలు పన్నులు ఏంటండి ఇలా వడ్డించేస్తున్నారు అని అడిగితే నవ్వులు చిందించారు. మందీ మార్బలంతో కాదు ఒక్కరే రండి మాట్లాడుకుందాం అని అనేటప్పటికీ కోన మళ్లీ నవ్వులు చిందించారే తప్ప వారికి ఎదురు సమాధానం చెప్పలేకపోయారు. అదే నాని కానీ మరొకరు కానీ కావాలి బూతులు తిట్టేవారు ప్రజలను.. కానీ.. కోన మాత్రం తప్ప తప్పిదాలను నవ్వుతూనే ఒప్పుకుని అక్కడి నుంచి జారుకున్నారు.
వాస్తవానికి పథకాలు అందని వర్గాలకు సంబంధించి ముందు నుంచి ఓ మాట వినిపిస్తోంది. కోటీ 75 లక్షలు పంచామని చెబుతున్నారే ఎవరికి పంచారు ? ఏ వర్గాలను ఆదుకున్నారు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు కొందరు. ఇదే ఇప్పుడు తరుచూ చర్చకు తావిస్తోంది. కనీసం పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారని జగన్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఇదే సందర్భంలో ఎమ్మెల్యేలు ఈ విధంగా ఇంటింటి ప్రచారానికి వెళ్లి, రంగు రంగుల కరపత్రం అందించి వస్తే మాత్రం జనం అస్సలు ఒప్పుకోవడం లేదు. అప్పటికీ వలంటీర్ల సాయంతో తెలివిగా కొందరు ఎమ్మెల్యేలు తమకు ఇబ్బంది రాని చోట్లకు వెళ్లి తప్పుకుంటున్నా ఎక్కడో ఓ చోట దొరికి పోతున్నారు. ఒకవేళ ఆ ప్రాంతానికి వచ్చి కూడా సరిగా ఎవ్వరినీ పట్టించుకోకుండా ప్రజా ప్రతినిధులు వెళ్లిపోతే, వాళ్లను ఉద్దేశించి, స్థానిక సమస్యలు వివరిస్తూ సోషల్ మీడియాలో లైవ్ వీడియోలు ఉంచుతున్నారు. ఇవే పరిణామాలు స్పీకర్ తమ్మినేనికి కానీ కోన రఘుపతికి కానీ రేపటి వేళ కూడా ఎదురుకాక తప్పవు.