ప్రైవేటీకరణ విషయంలో నరేంద్రమోడి సర్కార్ చాలా దూకుడు మీదుంది. వివిధ రంగాల్లో ఎంత అవకాశం ఉంటే అన్ని సంస్ధలనూ ప్రైవేటీకరించేయాలని డిసైడ్ చేసింది. దీనికి అనుగుణంగానే పెద్ద జాబితాను ఇప్పటికే రెడీ చేసుకుంది. ఇందులో భాగంగానే బ్యాంకులపైన కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తాజా సమాచారం ప్రకారం నాలుగు బ్యాంకులను ముందుగా ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించేసింది.
పనితీరు కానీ ఆర్ధిక పరిస్ధితి కానీ బాగానే ఉన్నప్పటికీ మరి బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరించాలని డిసైడ్ చేసిందో ఎవరికీ అర్ధం కావటంలేదు. యూనియన్ నేతల ప్రకారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ముందుగా ప్రైవేటురంగానికి అప్పగించేయాలని ఇప్పటికే నిర్ణయమైంది. గతంలోనే నష్టాల్లో ఉన్న బ్యాంకులను లాభాల్లో ఉన్న బ్యాంకుల్లోకి విలీనం చేసిన విషయం తెలిసిందే.
బ్యాంకుల్లో రానీ బాకీలు పెరిగిపోవటంతోనే కొన్ని బ్యాంకుల ఆర్ధిక పరిస్ధితి దారుణంగా తయారైంది. ఈ కారణంగానే కొన్ని బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయాయి. కార్పొరేట్ ప్రపంచంలోని ప్రముఖులు తీసుకున్న వందల, వేల కోట్ల రూపాయలను తిరిగి రాబట్టి బ్యాంకుల్లో జమ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. అయితే కేంద్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోంది. అప్పులు తీసుకుని ఎగొట్టిన ప్రముఖులను పనిపట్టడం మానేసి బ్యాంకులను విలీనం చేసేస్తోంది.
కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్న బ్యాంకుల్లోని యూనియన్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50 వేలమంది ఉద్యోగులున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33 వేలమందున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలమంది, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో 13 వేలమంది ఉద్యోగులున్నారు. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయానికి వ్యతేకంగానే బ్యాంకులు జాతీయ స్ధాయిలో రెండు రోజుల సమ్మెకు రెడీ అయ్యాయి.