బ్రేకుల్లేని హిట్స్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా సత్తా చాటుతున్న అనిల్ రావిపూడి మళ్లీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు `ఎఫ్3`తో వచ్చేశారు. 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఎఫ్2కి ఇది సీక్వెల్. ఇందులో వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ జంటలుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ ముఖ్య పాత్రలను పోషించగా.. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్న ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిటీ ఎంటర్టైనర్.. పలు కారణాల వల్ల వాయిదా పడినా, ఎట్టకేలకు నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు సైతం పడగా.. సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు.
కథ ఏమీ పెద్దగా లేకపోయినా.. ఓవర్ ది టాప్ ఎంటర్టైనర్ గా ఎఫ్ 3 నిలుస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. ఫన్ క్రాకర్స్ వెలుతూనే ఉంటాయ్. వెంకీ ఎప్పటిలాగానే తన టైమింగ్తో అదరగొట్టేశాడు, వరుణ్ తేజ్ మరోసారి తన మార్క్ ను చూపించాడు. ఆలీ, సునీల్ల కామెడీ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది, దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ఒక మైనస్. పూజా హెగ్డే చేసిన సాంగ్ పెద్దగా అలరించలేకపోయింది అంటూ ట్విట్టర్ వేదికగా రివ్యూల మోత మోగిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ గురించి ఓ క్రేజీ టాక్ నెట్టింట వైరల్ గా మారింది. దాని ప్రకారం.. ఎఫ్ 3 ఓటీటీ డీల్ సాలిడ్ ధరకు క్లోజ్ అయిందట. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం సోనీ లివ్ సంస్థ, అమెజాన్ సంస్థ పోటీ పడ్డాయట. అయితే చివరకు సోనీ లివ్ సంస్థనే ఎఫ్ 3 ఓటీటీ రైట్స్ ను దక్కించుకుందని అంటున్నారు.
అందుకుగానూ సదరు సంస్థ రూ. 18 కోట్లు చల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే ఎఫ్ 3 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీ ధర పలికినట్టే అవుతుంది. కాగా, డబ్బు, దాని వల్ల వచ్చే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో వెంకటేష్ రేచీకటి ఉన్న వ్యక్తిగా, వరుణ్ తేజ్ నత్తి ఉన్న యువకుడిగా అలరిస్తారు.