అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. అప్పటివరకు బాగానే ఉన్న ఆయన.. ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురి కావటంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గుజరాత్ లో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వడోదరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు.
అప్పటివరకు ప్రసంగిస్తున్న ఆయన.. ఒక్కసారిగా కూలబడిపోవటంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. సెక్యురిటీ సిబ్బంది ఆయన్ను కిందకు పడకుండా పట్టుకున్నారు. ఈ అనూహ్య పరిణామం పలువురికి షాకింగ్ గా మారింది. సీఎం స్టేజ్ మీద పడిపోవటంతో అందరూ షాక్ తిన్న పరిస్థితి. బీపీ రావటంతో కళ్లుతిరిగి పడిపోయినట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఆసుపత్రికి తరలించిన అనంతరం ముఖ్యమంత్రికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎంకు ఎలాంటి సమస్యా లేదన్నారు. కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్య కుదుటపడినట్లు వెల్లడించారు. సీఎం విజయ్ రూపానీకి ఇటీవల ఆరోగ్యం సరిగా లేదని.. అందుకే.. అలాంటి పరిస్థితి చోటు చేసుకుందని చెప్పారు.
స్టేజ్ మీద మాట్లాడుతూ పడిపోయిన ముఖ్యమంత్రి.. ఆసుపత్రిలో చికిత్స అనంతరం తనకు తానే నడుచుకుంటూ ఆసుపత్రి నుంచి కారు వరకు నడుచుకుంటూ వెళ్లినట్లుగా చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీకి సీట్లు తగ్గిన నేపథ్యంలో స్థానిక సంస్థల్లో పార్టీ అధిక్యతను ప్రదర్శించటానికి వీలుగా.. సీఎమ్మే స్వయంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఉదంతం చోటు చేసుకుందని చెబుతున్నారు.