గత కొద్దిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు నభూతో నభవిష్యత్ అన్నరీతిలో స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనలు టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరుల్లో కొత్త జోష్ నింపిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఇంకా కొంతమంది నేతలు, కార్యకర్తలు వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలు, పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం వంటి పనులతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే తన పర్యటనల సందర్భంగా కార్యకర్తలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ లేని ఇల్లు మనుగడ సాగించలేదని, పార్టీ కూడా అంతేనని చంద్రబాబు అన్నారు. పార్టీలో విచ్చలవిడిగా మాట్లాడితే కఠిన చర్యలుంటాయని, కార్యకర్తలు పార్టీకి లాయల్‌గా ఉండాలని, పార్టీని నిలబెట్టేది వాళ్లేనని ఆయన అన్నారు. కార్యకర్తలు లేకపోతే నాయకులు లేరని, అలాగే కమిటీ వాళ్ల పని వాళ్లు చెయ్యాలని పిలుపునిచ్చారు.
ముందుగా అభ్యర్థులను ప్రకటించాలని కార్యకర్తలు కోరుతున్నారని, సమర్థత, పని తీరు చూసి కర్నూలులో సుబ్బారెడ్డిని ప్రకటించిన తరహాలోనే ముందుగానే ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. వైసీపీ దొంగ ఓట్లపై కేడర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. తన చుట్టూ నాయకులు తిరిగితే లాభం లేదని, కార్యకర్తల కోసం పని చేయాలని హితవు పలికారు. తన దగ్గరకు వచ్చి తనను మోహమాట పెడితే ఇకపై కుదరదన్నారు.
40 శాతం సీట్లు ఈ సారి యువతకు కేటాయిస్తామని, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ అవకాశామిస్తానని చెప్పారు. 72 ఏళ్ల వయసులోనూ తాను 27 ఏళ్ల వాడిలా పని చేస్తానని చెప్పారు. అసెంబ్లీలో శపథం చేసి బయటకు వచ్చానని, కౌరవ సభను గౌరవ సభగా మార్చాకే అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ అనే యాప్‌ను ప్రారంభిస్తున్నామని, కార్యకర్తలకు వైద్యం కోసం ప్రముఖ అసుపత్రులతో ఒప్పందం చేసుకుందామని భరోసానిచ్చారు.