ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ మరో వివాదంలో ఇరుక్కున్నారు కానీ తెలివిగా తప్పుకున్నారు. పలు ఆరోపణల మీద అరెస్టు అయిన ఆయన ఆత్మబంధువు కొండారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించుకుని పొలిటికల్ మైలేజీ పెంచుకుంటున్నారు. తప్పు చేస్తే తన, పర అన్న భేదం చూడరు అని సజ్జల రామకృష్ణా రెడ్డి అనే ప్రభుత్వ పెద్ద కూడా చెబుతున్నారు. ప్లీజ్ నమ్మండి. నవ్వకండి.
దీని ప్రకారం త్వరలో ఆయనను కడప జిల్లా నుంచి బహిష్కరించాలని కూడా ఎస్పీకి సిఫారసు చేస్తూ ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసుకున్నారట. ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ప్రతినిధులను అదే పనిగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, బెదిరిస్తున్నారని కాల్ డేటా ఆధారంగా వచ్చిన వివరాలను పరిశీలించి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారట. రెండు రోజుల కిందట అరెస్టు అయి ఇవాళే (గురువారం, మే 11,2022) విడుదలయిన ఆయనపై బహిష్కరణ వేటు జిల్లాలో కలవరం సృష్టిస్తోంది.
ఓ వైపు నారాయణ కేసు మరోవైపు చంద్రబాబును అరెస్టు చేయించాలన్న ఆరాటం ఇవన్నీ ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంటున్న సందర్భంలో సొంత బంధువుపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం అన్నది ఒక రాజకీయ వ్యూహం. అయినా జిల్లా బహిష్కరణ వల్ల ఆయనకు జరిగే నష్టమేమీ లేదు. ఫోన్లలో పనులైపోతుంటాయి.
సరే జగన్ ఆయనను బహిష్కరించారు అనుకుందాం… ఇదే విధంగా అందరి నిందితుల విషయమై కూడా కఠినంగానే ఉన్నారా వ్యవహరిస్తున్నారా అన్నదే సందేహం. ఇప్పటికిప్పుడు కొండారెడ్డిపై వేటు వేసినంత మాత్రాన వివిధ జిల్లాలలో వివిధ కాంట్రాక్టు సంస్థల నేతృత్వాన జరుగుతున్న అడ్డగోలు పనులేవీ ఆగిపోవు కానీ, ఇలాంటి చర్యలతో ఇమేజ్ అయితే బాగానే పెంచుకోవచ్చు అన్నది జగన్ అభిప్రాయం. వ్యూహం అని టీడీపీ అంటోంది. కానీ జగన్ వర్గాలు మాత్రం తమ అధినేత చర్యలను సమర్థించుకోవడం విశేషం.
పేపర్లు, ప్రకటనలతో ఇమేజ్ ఎలా పెంచుకోవచ్చో జగన్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. కేవలం ప్రకటనలు చేసి మార్కులు కొట్టేస్తారు. ఇపుడు కొండారెడ్డి పరిస్థితి అంతే అంటున్నాయి టీడీపీ వర్గాలు. అధికారికంగా కొండారెడ్డిని బహిష్కరిస్తారు. కానీ ఆయన జిల్లాకు వస్తే అడ్డుకునే శక్తి ఈ పోలీసులకు ఉందా అంటున్నారు టీడీపీ నేతలు. ఇది మైలేజ్ పెంచుకునే డ్రామా తప్ప మరేం కాదంటున్నారు.