ఒకప్పుడు సినిమావాళ్ల డైలాగులు అంటే ఉండే క్రేజ్ కన్నా ఇప్పుడున్న క్రేజ్ మరీ విపరీతంగా ఉంటోంది. అందుకే మొన్న అట్లుంటది మనతో అని డీజే టిల్లుగాడి డైలాగ్ చెప్పి ఉత్సాహపరిచారు కేటీఆర్ హన్మకొండలో ! ఈ సారి భాగ్యనగరిలో పూరీ జగన్నాథ్ డైలాగ్ చెప్పి మళ్లీ శ్రేణులను ఉత్సాహపరిచి, తనదైన జోష్ తో కొన్ని మాటలు చెప్పారు.
ఇవి అందరి అంగీకారం పొందాలని రూలేం లేదు కానీ చెప్పే విధానం ప్రకారం చూస్తే గులాబీ శ్రేణులు ఈ డైలాగులు విని సంబరపనడుతున్నాయి. సోషల్ మీడియాలో కేటీఆర్ మాటలను ట్రెండ్ ఇన్ లో ఉంచి ప్రత్యర్థులకు కౌంటర్లు ఇస్తున్నాయి.ఏదేమయినా మహేశ్ బాబు చెప్పిన విధంగా సినిమాల ప్రభావం జనాలపై బాగానే ఉంది. నో డౌట్ ఇన్ ఇట్.
ఎన్ని డైలాగులు అయినా చెప్పండి.. కానీ ప్రజలను ఆకట్టుకోవడం అన్నదే పరమావధి కావాలి. రాజకీయాల్లో డైలాగులకు లోటేం ఉండదు. కొన్ని అద్దె పలుకులు కూడా బాగానే పోతాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ డైలాగులు మీడియాలో బాగానే పోతున్నాయి. అవే ట్రెండ్ ఇన్ లో ఉంటున్నాయి.
డిజిటల్ మీడియా లో వార్తల విస్తృతి వేగవంతం అయ్యాక పొలిటికల్ డైలాగులు ఇంకాస్త ఎక్కువగానే చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ కొన్ని మాటలు చెప్పారు రాహుల్ ను ఉద్దేశించి.. మరియు జేపీ నడ్డా (బీజేపీ బాస్) ఉద్దేశించి. అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కేటీఆర్ మాటలలో ఎక్కువగా సినిమా డైలాగుల ప్రభావం ఉంటుంది. పత్రికలు రాయక తప్పని విధంగా, అంతగా ఆకట్టుకునే స్థాయిలో కొన్ని మాటలు ఆయన పలుకుతుంటారు. ప్రాసలకు ప్రాధాన్యం ఇస్తూ మాట్లాడుతూ ఉంటారు.తాజాగా ఆయన పూరీ జగన్నాథ్ ను ఇమిటేట్ చేస్తూ గతంలో ఇడియట్ సినిమా కు రాసిన డైలాగ్ ను కాస్త మార్చి చెప్పారు.
ఆ సినిమాలో చంటి చంటి గాడు ఇక్కడ లోకల్ .. అని అనిపించారు రవితేజతో ! ఆ డైలాగ్ ఎంతో పాపులర్ అయింది.. ఇదే సినిమాలో సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు కానీ చంటి చంటి గాడు ఇక్కడ లోకల్ అని చెప్పించిన డైలాగ్ ఓ లెవల్లో ఉంటుంది. మాస్ పల్స్ తెలిసిన డైలాగ్ రైటర్ పూరీ.. నో డౌట్ ఇన్ ఇట్.. అదేవిధంగా మాస్ పల్స్ తెలిసిన లీడర్ కేటీఆర్. అందుకే పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు కానీ కేసీఆర్ మాత్రం ఉండేదిక్కడే ! అన్న అర్థం వచ్చే విధంగా తనకు తెలిసిన ఇంగ్లీషులో ఓ డైలాగ్ ను రాశారు.
ఇదే ఇప్పుడు పెను చర్చకు తావిస్తోంది. విపక్ష పార్టీలు ఈ డైలాగ్ విని పెదవి విరుస్తున్నాయి. అంతటి స్థాయిలో కౌంటర్లు రాయకపోయినా వీలున్నంత వరకూ ప్రతిస్పందిస్తున్నాయి. చంటి గాడు లోకల్ అయితే కేసీఆర్ గ్లోబల్ కావాలి.. అంతేనా కేటీఆర్.. అంటే ఆ స్థాయిలో ప్రపంచం నివ్వెరపోయే స్థాయిలో కేసీఆర్ ఇకపై పనిచేయగలగాలి. లేదంటే విపక్షాల ఎదుగుదలకు కేసీఆర్ మరియు కేటీఆర్ కారణం కావొచ్చు.