ఏపీ అన్నంతనే కులాల లెక్కలు.. డొక్కలతో నిండి ఉంటుంది. విషయం ఏదైనా.. మొదలయ్యేది.. పూర్తి అయ్యేది కుల సమీకరణలోనే. రాజకీయం వరకు ఎందుకు? ఏపీలో మరీ ముఖ్యంగా కోస్తా ప్రాంతానికి కొత్త వారు వెళితే.. వారికో సిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది.
కొత్తగా పరిచయం అయిన వ్యక్తి పది నిమిషాల్లోనే.. ఎదుటి వ్యక్తి కులం ఏమిటో తెలుసుకోవటం కోసం వారెంతగా తపిస్తారో చూసినప్పుడు ఆశ్చర్యమేస్తుంది.
అలా అని వారిని తప్పు పట్టలేం. ఎందుకంటే.. ఏళ్లకు ఏళ్లుగా ఎదుటి వారి కులం ఏమిటి? తమతో మాట్లాడే వారి మూలాలు ఏమిటన్న విషయాన్ని తెలుసుకోవటానికి వారిచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ.
కొంతమంది తమకున్న అలవాటు గురించి.. బయట వారు కాస్త వివరంగా చెప్పినప్పుడు సిగ్గుపడుతుంటారు.
తమకు ఈ అలవాటు ఎలా వచ్చిందో అర్థం కాలేదంటూ చింతించే వారు లేకపోలేదు. ఇదంతా ఎందుకంటే.. ఏపీలో కులానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని చెప్పటానికే. కోస్తా ప్రాంతంలో ఉండే కుల ప్రస్తావన ఉత్తరాంధ్రలో చాలా చాలా తక్కువగా కనిపిస్తుంటుంది.
అదే సమయంలో రాయలసీమలో మాత్రం మరీ ఎక్కువ కాదు.. మరీ తక్కువ కాదన్నట్లుగా ఉంటుంది.
తెలంగాణలో ఇందుకుభిన్నంగా కుల ప్రస్తావన ఉండదు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నుంచి విడిపోయిన రాష్ట్రానికి పట్టిన చీడల్లో ఒకటి కులం. ఇటీవల కాలంలో తెలంగాణలోనూ కుల ప్రస్తావన ఎక్కువ అవుతుందని చెప్పక తప్పదు. కులం మీద ఇంత చర్చ జరుగుతున్న వేళ.. అధికారపక్షంలో ఉన్న వారు చేసే ప్రతి పనిని కులం కోణంలో కూడా చూడటం కనిపిస్తూ ఉంటుంది.
ఎప్పుడూ లేని రీతిలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి ఒక ఇంటర్వ్యూను ఇచ్చారు. మిగిలిన ప్రముఖులకు భిన్నంగా భారతి ఉంటారు.
సొంత మీడియా సంస్థ ఉన్నప్పటికీ.. ఆమె పెద్దగా వార్తల్లో ఉండకుండా తెర వెనుకనే ఉంటారు.
అలాంటి ఆమె తాడేపల్లిలోని తమ నివాసంలో గోశాలను నిర్మించుకున్నారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా నిర్మించిన ఈ గోశాల మీద ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ చేసింది మరెవరో కాదు ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గోశాల నిర్మాణం గురించి.. తన వ్యక్తిగత విషయాల గురించి ఆమె మాట్లాడారు.
ఇక్కడ ప్రశ్న ఏమంటే.. జగన్ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నారని.. ఆ సామాజికవర్గానికి సంబంధించిన వారికే తప్పించి.. మిగిలిన వారికి అవకాశాలు లభించటం లేదన్న విమర్శ.. ఆరోపణ ఉంది. ఒకవైపు ఇలాంటి మాటలు వినిపిస్తున్న వేళ.. సీఎం సతీమణి ఇచ్చే ఇంటర్వ్యూను సైతం సొంత సామాజిక వర్గానికే తప్పించి.. మరొకరికి ఇవ్వొచ్చు కదా? అన్నది ప్రశ్న. సాధారణంగా సెలబ్రిటీగా సుపరిచితురాలైన శిల్పారెడ్డిని అందరూ ఇంటర్వ్యూ చేస్తారు.
కానీ.. సీఎం సతీమణి భారతిని మాత్రం ఇంటర్వ్యూ చేసే అవకాశం ఆమెకు లభించింది. ఇది కూడా రెడ్డి ట్యాగ్ ఉన్నందుకేనా? అన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.