సీఎం జగన్ సభకు జనం రావడం లేదన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. తిరుపతిలో జగన్ పర్యటనకు తప్పనిసరిగా రావాలని, లేకుంటే 500 రూపాయలు ఫైన్ వేస్తామని డ్వాక్రా మహిళలను ఓ అధికారి బెదిరిస్తున్న ఆడియో లీక్ అయిన వైనం ఆ విమర్శలకు ఊతమిచ్చేలా ఉంది. మరోపక్క, ఇదే రోజు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినాయకుడు చంద్రబాబు విశాఖ పర్యటనకు ఇసకేస్తే రాలనంత జనం రావడం…జగన్ పై జనానికున్న వ్యతిరేకతను తెలియజేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. జగన్ సమావేశాలకు జనం రావడం లేదని, చంద్రబాబు పర్యటనలో జనాలు మీద పడుతున్నారని రఘురామ అన్నారు. టీడీపీ సమావేశాలకు ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలివస్తున్నారని, అదే సమయంలో జగన్ సభకు జనాలు రావాలి, చప్పట్లు కొట్టాలని వైసీపీ నేతలు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇకనైనా విద్యా దీవెనలు తల్లులకు ఇవ్వడం మానేసి కాలేజీలకు ఇవ్వాలని రఘురామ చురకలంటించారు. వైసీపీ ఓట్ల కుట్ర ప్రజలకు తెలిసిపోయిందని, అది ఒక వంచన కార్యక్రమమని అన్నారు. తల్లి అకౌంట్లలోకి డబ్బులు వేసి, దాన్ని కాలేజీలకు ఇవ్వడమేంటని ఆర్ఆర్ఆర్ ప్రశ్నించారు. ఓట్ల కొనుగోళ్లలో ఇది కూడా భాగమా? అని రఘురామ ఎద్దేవా చేశారు. విద్యా దీవెన అనేది ఒక అర్థం లేని ఆలోచన అని, జగనన్న వసతి దీవెన కూడా అందరికీ రావడం లేదని జగన్ గుట్టురట్టు చేశారు.
పథకాల పేరుతో జగన్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని రఘురామ దుయ్యబట్టారు. గతంలో సంక్షేమ పథకాలే లేవన్నట్లుగా జగన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అయ్యా జగన్…నీ పథకాలకో దండం అంటూ మీడియా సమావేశం లైవ్ లో జగన్ పరువు తీశారు.