ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ వచ్చాక రాష్ట్రం దివాలా తీసిందని, జగన్ ది ఓ ఐర్ లెగ్ అని దుయ్యబట్టారు. కోడికత్తి వంటి డ్రామాలు తనకు చేతకావని,టీడీపీ నేతలకు ఆ అవసరం కూడా లేదని ఎద్దేవా చేశారు. జగన్ ఊరికొక సైకోను తయారు చేశారని, ఇలాంటి పొలిటికల్ సైకోలను అణచివేసే బాధ్యత టీడీపీ నేతలకుందని అన్నారు. అలా చేసే శక్తి కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలకూ ఉందని చంద్రబాబు అన్నారు.
జగన్ సర్కార్ పెడుతున్న తప్పుడు కేసుల గురించి నేతలు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడొద్దని చంద్రబాబు సూచించారు. ఎంత ఎక్కువగా కేసులు ఉంటే అంత భవిష్యత్తు అని చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతల కేసుల కోసం ఓ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, అన్నింటినీ పరిష్కరించే బాధ్యత తనదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు. పనిచేసేవాళ్లకు, ప్రజలతో నిత్యం మమేకయ్యే వారికే పదవులు ఉంటాయని టీడీపీ అధినేత మరోమారు స్పష్టం చేశారు.
బాదుడే బాదుడు కార్యక్రమాన్ని గడపగడపకు తీసుకెళ్లాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీలో ప్రజలకు అత్యధిక భాగస్వామ్యం కల్పించాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పోరాడాలని, 30 ఏళ్లు అధికారంలో ఉండేలా టీడీపీ గెలుపు ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగంలో శ్రీరామ్ అనే బాలుడు మృతి చెందిన ఘటనపై చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అతడి మృతదేహాన్ని తండ్రి బైక్ పై ఇంటికి తీసుకెళ్లిన విషయం తనను కలిచివేసిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్స్ డ్రైవర్లు కనికరం లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆసుపత్రి అధికారులు అంబులెన్సు ఏర్పాటు చేయలేకపోవడంతో ఆ బాలుడి మృతదేహాన్ని అతడి తండ్రి బైక్ పై తీసుకెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.