తమిళ స్టార్ హీరో ధనుష్ ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తాను ఎంపిక చేసుకున్న సినిమాలతో పాటు.. అతగాడి విలక్షణ నటన అతడ్ని మిగిలిన వారికి భిన్నంగా ఉంచుతుంది. దీనికి తోడు మధ్యలో వచ్చిన రజనీకాంత్ అల్లుడి ఇమేజ్ అతడ్ని మరింత సుపరిచితులుగా మార్చింది. ఈ మధ్యనే భార్యతో విడాకులకు సిద్ధమైన ధనుష్ ను కొంతకాలంగా ఒక విచిత్రమైన కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే.
దాదాపు ఆరేళ్ల క్రితం మదురై జిల్లాలోని మేలూరులోని మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు కతిసేరన్.. మీనాక్షి దంపతులు. వారి వాదన ఏమంటే.. ధనుష్ తమ కుమారుడేనని.. చిన్నతనంలో ఇంట్లో నుంచి పారిపోయినట్లుగా పేర్కొన్నారు. ధనుష్ తమ మూడోకొడుకని.. అతను సమర్పించిన జనన ధ్రువీకరణ పత్రాలు ఫేక్ అని పేర్కొన్నారు. తామే ధనుష్ కు అసలైన తల్లిదండ్రులు అయినందువల్ల.. నెలకు రూ.65వేల పరిహారం ఇప్పించాలని వారు కోర్టును కోరారు.
తమ వాదనకు బలం చేకూరేలా ధనుష్ బర్త్ సర్టిఫికేట్.. పదో తరగతి మెమో.. ఫిజికల్ ఐడెంటిఫికేషన్ ఫ్రూప్ ను సమర్పించారు. ఈ కేసును పరిష్కరించేందుకు డీఎన్ ఏ టెస్టును కోర్టు చెప్పగా.. ధనుష్ అతని లాయర్ ఇందుకు నో చెప్పారు. ఐడెంటిఫికేషన్ ఫ్రూఫ్స్ సరిపోతాయో లేదో చెక్ చేసేందుకు ధనుష్ కు వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది.
ఇందులో ఫలితాలు ధనుష్ కు అనుకూలంగా రావటంతో దంపతులు దాఖలు చేసుకున్న సాక్ష్యాలు బలంగా లేవని కోర్టు కేసును 2020లో కొట్టేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆ దంపతులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటివరకు ధనుష్ అందించిన ఆధారాలపై పోలీసులతో విచారణ జరిపించాలని కోరారు. దీనిపై వివరణ ఇవ్వాలని ధనుష్ కు హైకోర్టు సమన్లు జారీ చేసింది.
తాను తమిళ నిర్మాత కస్తూరి రాజా.. విజయలక్ష్మిల కుమారుడినని.. తన డబ్బుల కోసమే వారు అలా చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే.. మద్రాస్ హైకోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ధనుష్ వాటికి సమాధానాలు ఇవ్వాల్సి వస్తోంది. మొత్తంగా విడవకుండా వెంటాడుతున్న కేసుతో ధనుష్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పక తప్పదు.