విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, టీడీపీ నేతల మాటల యుద్ధానికి తెర తీసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేత బోండా ఉమలకు పద్మ సమన్లు జారీ చేయడంతో ఈ వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే చీరలు కట్టుకోవాలంటూ చంద్రబాబు, లోకేశ్ లనుద్దేశించి మంత్రి రోజా చేసిన కామెంట్లతో ఈ మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
ఈ క్రమంలోనే మంత్రి రోజాపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారిత అంటే ‘కచ్చా బాదాం’ పాటకు డ్యాన్స్ చేసింత ఈజీ అనుకుంటున్నావా? జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగులకు వెకిలి నవ్వులు నవ్వుకూంటూ పారితోషికం తీసుకోవడం అనుకుంటున్నావా? అంటూ రోజాపై అనిత మండిపడ్డారు. మహిళా సాధికారిత గురించి మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదని అనిత ధ్వజమెత్తారు.
పాత సినిమాల్లో బందిపోట్లు రోడ్డు మీదికి వస్తే ప్రజలంతా ఇళ్లలోకి పరిగెత్తి తలుపులు మూసుకునేవారని, ఇప్పుడీ సీఎం బందిపోటులా రోడ్డు మీదకు వస్తే ప్రజల పరిస్థితి అలాగే ఉందని ఎద్దేవా చేశారు. ఇతగాడు ఇల్లు దాటి బయటికి వస్తే పోలీసులందరూ పహారా కాయడం ఒకెత్తని, షాపులు మూసేయడం, ప్రజలు ఇళ్లలోకి వెళ్లి కిటికీ తలుపులు కూడా వేసుకోవడం మరొక ఎత్తని చురకలంటించారు. వీళ్లంతా చంద్రబాబు కరకట్ట నివాసం గురించి మాట్లాడేవాళ్లని, అసలు వీళ్లకు సిగ్గుందా? బుర్రలు ఏమైనా పనిచేస్తున్నాయా లేదా? అని మండిపడ్డారు.
మహిళా సాధికారిత జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యం అంటుంటే తనకు నవ్వొస్తోందని అనిత ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరిగిన అనేక అత్యాచార ఘటనలపై నోరు మెదపని సీఎం ఏం రంగు చీర కట్టుకోవాలో చెప్పాలంటూ రోజాపై అనిత విమర్శల వర్షం కురిపించారు. మరి, అనిత కామెంట్లపై రోజా స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.