టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్…తాజాగా ప్లీనరీ సందర్భంగా కూడా ఆ వ్యవహారంపైనే ఎక్కువగా ప్రసంగించారు. దేశానికి కావాల్సింది నేషనల్ ఫ్రంట్ కాదని.. ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా అని చెబుతూనే…హైదరాబాద్ నుంచి ఆ అజెండా వస్తే అది రాష్ట్రానికే గర్వకారణమన్నారు కేసీఆర్. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు కేసీఆర్.
ఈ సందర్భంగానే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన పార్టీ పేరేమిటో కూడా పరోక్షంగా చెప్పేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు ఇపుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు టీఆర్ఎస్ లాగానే భారత్ కు బీఆర్ఎస్ అనే నినాదంతో కేసీఆర్ ముందుకు పోబోతున్నారన్న సంకేతాలు ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.
కేసీఆర్ పక్కాగా జాతీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారన్న పుకార్లకు ఆయన తాజా వ్యాఖ్యలే నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాదాపు గంటన్నరపాటు జరిగిన కేసీఆర్ ప్లీనరీ ప్రసంగంలో ఎక్కువ భాగం టీఆర్ఎస్ గురించి కాకుండా దేశ రాజకీయాలపైనే మాట్లాడటం ఆ వాదనలకు బలాన్నిస్తున్నాయి.
బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఒక్కటి కావాలని వామపక్ష నాయకులు అన్నారని కేసీఆర్ చెప్పారని, కానీ, దానిని తాను వ్యతిరేకించానని వెల్లడించారు. దేశ ప్రజలను ఒక్కటి చేయాలని వారితో తాను చెప్పినట్లు పేర్కొన్నారు.అందుకే దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదని.. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించి.. ప్రజల అభ్యున్నతికి తోడ్పడే ప్రత్యామ్నాయ అజెండా రావాలని పేర్కొన్నారు.