సీఎంవో ఆఫీసుకు రాకుండా రహదారికి ముళ్ల కంచెలు వేసి బందోబస్తు పెట్టారు. ఈ క్రమంలోనే జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ తన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. “ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్లు? అంటూ చురకలంటించారు.
శాంతియుతంగా నిరసన తెలపడమే నేరమంటూ యూటీఎఫ్ నేతలను, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులను, ఉపాధ్యాయులను అక్రమంగా నిర్బంధించారని లోకేష్ ఫైర్ అయ్యారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దని మాట తప్పి మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా జగన్ మోసపు రెడ్డి గారు? అంటూ లోకేష్ పంచ్ లు వేశారు. ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్బంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
కాకమ్మ కబుర్లతో మూడేళ్లు గడిపేశారని, ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చెయ్యాలని లోకేష్ డిమాండ్ చేశారు.
కాగా, ”రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దు ఎందుకు చేయడం లేదు? ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇప్పుడు తెలియక ఇచ్చాము అని చెప్పడం హేయమైన చర్య. అరాచక ఆటవిక రాజ్యంలాగా తయారు అయింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు చేశాయి. పాదయాత్రలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయులు అడిగితే అరెస్టులు చేస్తున్నారు. యూటీఎఫ్ ఆందోళనలపై ప్రభుత్వ వైఖరి సరికాదు. వారిపై దాడి అనేది ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలి” అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
ఈ క్రమంలోనే నేడు ఉపాధ్యాయ సంఘమైన యూటీఎఫ్ తోపాటు16 ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానాలు పంపింది. అయితే, ఆ చర్చలకు ఉపాధ్యాయ సంఘాల నేతలు వెళతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.