టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు తన 73వ జన్మదినం జరుపుకుంటున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న చంద్రబాబు..అంతకుముందు తిరుపతి వేంకటేశ్వర స్వామికి పూజలు చేశారు. మళ్లీ తనకు శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని దేవుళ్లను కోరుకున్నానని, ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యలను దూరం చేసేలా పోరాడే తెలివి తేటలు నాకు ఇవ్వాలని కోరుకున్నానని అన్నారు.
ప్రపంచంలో తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా తనను అభిమానిస్తున్నారని, జన్మదినోత్సవం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారని ఆయన అన్నారు. తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు. తిరుపతిలోని అఖిలాండం వద్ద చంద్రబాబు క్షేమాన్ని కోరుతూ పూజలు నిర్వహించారు. టీడీపీ మీడియా విభాగం రాష్ట్ర సమన్వయకర్త శ్రీధర్ వర్మ 720 కొబ్బరికాయలు కొట్టగా, అలిపిరిలోని శ్రీవారి పాదాల వద్ద టీడీపీ కార్యకర్తలు, నేతలు 1,116 కొబ్బరికాయలు కొట్టారు.
చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన తండ్రి జన్మదినం సందర్భంగా ఆయనకు యువనేత నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మనిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు, అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టేవారు కూడా తండ్రితో సమానం అని చాణక్యుడు చెప్పాడు. ఆ ప్రకారంగా చూస్తే ఆయన (చంద్రబాబు) దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్నత చదువులు చదవగలిగారు.
లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాదిమందికి అన్నదాత అయ్యారు. ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా. లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్… ఆయనే మా నాన్న చంద్రబాబు గారు. నాన్నగారూ, మీకు జన్మదిన శుభాకాంక్షలు’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. విష్ యూ హ్యాపీ బర్త్ డే చంద్రబాబు గారూ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్ కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ‘శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని చిరు ట్వీట్ చేశారు. దీంతోపాటు గతంతో చంద్రబాబుతో కలిసి దిగిన పాత ఫొటోను షేర్ చేశారు.
‘మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ చంద్రబాబు గారికి భగవంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ‘పట్టిసీమతో గోదావరి తల్లిని కృష్ణమ్మ చెంతకు చేయిపట్టి నడిపించిన అపర భగీరథుడు, దేశంలోనే మొదటి నదుల అనుసంధాన కర్త చంద్రబాబు నాయుడి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క చెప్పిన బర్త్ డే విషెస్ చాలా స్పెషల్ గా ఉన్నాయి. తనకు రాజకీయ ఓనమాలు దిద్దించిన చంద్రబాబు అంటే సీతక్కకు ఎనలేని అభిమానం. ఈ కారణంగానే ఆమె ఏ పార్టీలో ఉన్నా… ఏ స్థితిలో ఉన్నా చంద్రబాబుకు గ్రీటింగ్స్ చెప్పకుండా ఉండలేరు. సీతక్క ఒకప్పుడు టీడీపీలోనే ఉన్నా… విభజన తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చంద్రబాబు చేతికి రాఖీ కట్టకుండా సీతక్క ఉండలేరు. అందుకే, చంద్రబాబు చేతికి రాఖీ కడుతున్న ఫొటోను షేర్ చేసిన సీతక్క.. ‘‘హ్యాపీ బర్త్ డే అన్నా’’… అంటూ చంద్రబాబుకు బర్త్డే గ్రీటింగ్స్ చెబుతూ చేసిన ట్వీట్ వైరల్ అయింది.