నమ్మినోళ్లకు మాత్రమే మోసం చేసే ఛాన్సు ఎలా ఉంటుందో.. అభిమానించే వారినే అవమానించే అవకాశం కూడా అలానే ఉంటుందేమో? గతానికి భిన్నంగా తాము అభిమానించి.. ఆరాధించే వారి విషయంలో ప్రముఖులు అనుసరించే తీరు ఇటీవల కాలంలో వార్తాంశాలుగా మారుతున్నాయి. తాజాగా అలాంటి సీనే చేశారు ఏపీ మంత్రి.. సీనియర్ రాజకీయ నేత ధర్మాన ప్రసాదరావు. జగన్ 2.0లో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు భారీగా స్వాగత సత్కారాన్ని ఏర్పాటు చేయటం.. ఆ సందర్భంగా ఆయన్ను అభిమానించే అభిమాని ఒకరు అభిమానంతో వ్యవహరించిన దానికి ధర్మాన రియాక్షన్ షాకింగ్ గా మారింది.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి శ్రీకాకుళం వచ్చిన ధర్మానకు స్వాగతం పలికేందుకు భారీగా నాయకులు.. కార్యకర్తలు బారులు తీరారు. ఆయన స్వాగత ర్యాలీతో పాటు.. బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.
ఇలాంటి వేళ.. ఒక కార్యకర్త అమితమైన అభిమానంతో ముందుకు వచ్చారు. మంత్రి ధర్మాన చేతిని కాసింత గట్టిగా పట్టుకున్నారు.
దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన మంత్రి ధర్మాన.. వెంటనే ఆ కార్యకర్త చెంప ఛెళ్లుమనిపించారు. దీంతో.. చుట్టూ ఉన్న వారు ధర్మాన ఆగ్రహానికి విస్తుపోయారు. అభిమానంతో కంగ్రాట్స్ చెప్పటానికి వస్తే.. మరీ ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయాలా? చేయి చేసుకోవాలా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయినా.. ఇంత వయసులో కూడా అవసరం లేని కోపం కట్టలు తెంచుకోవటం ఏమిటి? దివంగత మహానేతతో అన్నాళ్లు సావాసం చేసిన ధర్మాన కోపం నరం ఇంకా తెగిపోలేదా?