ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించిన వైసీపీ నేతలు…అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారని జనం వాపోతున్న సంగతి తెలిసిందే. చెత్తపై పన్ను మొదలు విద్యుత్ చార్జీల పెంపు వరకు ఎడాపెడా జనంపై బాదుడే బాదుడు అన్న రీతిలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తుండడంతో జనంలో అసహనం పెరిగిపోయింది. ఇక, మేము ఇళ్లు కాదు ఊళ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పిన జగన్….సగంలో చేతులెత్తి కొంచెం డబ్బులిస్తాం మిగతాది మీరేసి కట్టుకోండి అనడంతో జగనన్న ఇళ్ల లబ్ధిదారులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, చాలామంది రైతులకు పట్టాలిప్పిస్తామని కూడా వైసీపీ నేతలు హామీలు గుప్పించి అమలు చేయడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి సీదిరి అప్పలరాజుకు తాజాగా సెగ తగిలింది. పలాస మండలం కంబిరిగాం గ్రామానికి చెందిన రైతులు, మహిళలు మంత్రిని అడ్డుకోవడం కలకలం రేపింది. ఓట్లేసి గెలిపించిన తమకే అన్యాయం చేస్తారా? అంటూ ఓ మహిళ మంత్రి కారుకు అడ్డంగా నిలుచుని ప్రశ్నించడంతో ఆయన అవాక్కయ్యారు.
కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం నూతన ఆర్డీవో కార్యాయాన్ని ప్రారంభించి పలాసకు వెళుతున్న సందర్భంగా కంబిరిగాం సమీపంలో అప్పలరాజు కాన్వాయ్‌ను రైతులు, మహిళలు అడ్డుకున్నారు. పట్టాలిప్పిస్తానని చెప్పి ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఓ మహిళతోపాటు రైతులు ప్రశ్నించారు. పోలీసులు ఆ మహిళను వారించే ప్రయత్నం చేసినా…మిగతా స్థానికులు పెద్ద సంఖ్యలో కారును చుట్టుముట్టడంతో మంత్రి కారు నుంచి బయటకు రాక తప్పలేదు.
ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన మంత్రి.. ఆ తర్వాత తేరుకుని రైతులకు సర్దిచెప్పేందుకు యత్నించారు. కారు ఫుట్ బోర్డ్ పై నిలుచొని వారిని సముదాయించే ప్రయత్నం చేసినా రైతులు వెనక్కు తగ్గలేదు. ఈ పట్టాల విషయంలో తాము మంత్రిని ఇంటికి వచ్చి కలిశామని రైతులు చెప్పగా..ఎప్పుడు వచ్చారంటూ గుర్తు లేనట్లుగా అప్పలరాజు సమాధానమివ్వడం కొసమెరుపు. చివరకు, రైతులను పక్కకు తోసేసిన పోలీసులు మంత్రి కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపేశారు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మూడేళ్ళలో వైసీపీ మంత్రులు మూటగట్టుకున్నది ప్రజాభిమానం కాదు ప్రజాగ్రహం. నూతన RDO కార్యాలయం ప్రారంభించి వస్తున్న వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు కాన్వాయ్ ని రైతులు, మహిళలు అడ్డుకున్నారు. ఒట్లేసిన గెలిపించినందుకు మాకు అన్యాయం చేస్తావా అని నిలదీశారు. (1/2) pic.twitter.com/X8yUwXb3pI
— Telugu Desam Party (@JaiTDP) April 4, 2022