ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని త్వరగా పూర్తి చేయాలని ఏపీ సర్కార్ కు హైకోర్టు కొద్ది రోజుల క్రితం సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తీర్పుపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. హైకోర్టు నిర్దేశించిన గడువులోపు తాము రాజధానిని నిర్మించలేమంటూ జగన్ చేతులెత్తేస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. నెల రోజుల గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సబబు కాదంటూ 90 పేజీలతో కూడిన అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
హైకోర్టు విధించిన గడువులో రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చేయడంపై బీజేపీ నేత లంకా దినకర్ స్పందించారు. పాలనకు జగన్మోహన్ రెడ్డి ఫిట్ కారని ఈ అఫిడవిట్‌తో తెలిపోయిందని దినకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క రాజధానికి 60 నెలలు పడితే, మూడు రాజధానులకు 180 నెలలు పడుతుందా ఎద్దేవా చేశారు. అది కూడా ఆల్రెడీ భూసేకరణ చేసి ఉన్న అమరావతికి 60 నెలలు పడితే…భూ సమీకరణ కూడా చేయాల్సివస్తే 1800 నెలలు పడుతుందేమోనంటూ చురకలంటించారు.
అమరావతి భూముల భవిష్యత్తు నగదీకరణ హామీతో రూ.25 వేల కోట్ల రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చిందని, అమరావతిపై కక్షగట్టి ఆ నిధులు రాకుండా కాలరాసిందెవరని దినకర్ నిలదీశారు. ఈ రోజు 480 ఎకరాలున్న అమరావతి రాజధాని భూములు తాకట్టు పెట్టి రూ. 3 వేల కోట్ల రుణం తెచ్చి, ఆ భూములనే అమ్మి ఆ అప్పు తీరుస్తామన్న ప్రతిపాదన ఎవరిదని ప్రశ్నించారు.
3 సంవత్సరాల సమయం వృథా చేసిన జగన్…ఇప్పుడు పెండింగ్ నిర్మాణ పనులకు కాంట్రాక్టర్లను వెతుకుతున్నారా? అని నిలదీశారు. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి మాటలు ఒకదానికొకటి పొంతన లేవని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిర్మాణల కోసం ఒక ఇటుక వేసే శక్తి కూడా జగన్ కు లేదని ఎద్దేవా చేశఆరు. రాష్ట్రంలో జగన్ పాలన పోవడంతోనే రాజధాని అమరావతి నిర్మాణం దానంతట అదే పరుగులు తీస్తుందనేది ప్రజల నమ్మకమని లంకా దినకర్ షాకింగ్ కామెంట్లు చేశారు.
అంతకుముందు, 6 నెలల్లో అమరావతిలో నిర్మాణాలు పూర్తి కావని, 60 నెలల సమయం పడుతుందని కోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ లో వెల్లడించింది. అమరావతి ప్రాంతం నుంచి నిర్మాణ కార్మికులు వెళ్లిపోయారని, వర్కర్లతో పాటు యంత్రాలను తిరిగి రప్పించేందుకే 2 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం చెప్పింది. పనులు మొదలుపెట్టేందుకు కనీసం 8 నెలల సమయం పడుతుందని వెల్లడించింది. అమరావతి రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణానికి 16 నెలల సమయం పడుతుందని, డ్రైనేజీ, నీటి సరఫరా, ఇతర పనులకు 36 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం అఫిడవిట్ లో తెలిపింది. ఈ క్రమంలోనే జగన్ పై దినకర్ విమర్శలు గుప్పించారు.