తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ లను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తమ సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ విధించిన సస్పెన్షన్పై స్టే విధించాలని వారు హైకోర్టును కోరారు. అయతే, ఈ విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని కోర్టు చెప్పింది. దీంతో, వారిని బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా సభ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తేల్చేశారు.
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ పై బీజేపీ వివాదాస్పద నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం, డబ్బు మదం, అహంకారంతో కొట్టుకుంటున్న కేటీఆర్ బలుపును దింపుతామని రాజా సింగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ‘నీ బలుపును దింపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకో కేటీఆర్’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్ పై బండి సంజయ్ పోటీ చేసి గెలవాలన్న కేటీఆర్ సవాల్ పై రాజాసింగ్ స్పందించారు. కమలాకర్ పై పోటీకి బండి సంజయ్ అవసరం లేదని, ఒక బీజేపీ సామాన్య కార్యకర్త చాలని అన్నారు. టీఆర్ఎస్ ను ఈసారి చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయని కేసీఆర్…700 మంది నిరుద్యోగుల చావుకు కారణమయ్యారని రాజాసింగ్ ఆరోపించారు.
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే…80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని గొప్పగా చెబుతున్నారని మండిపడ్డారు. చనిపోయిన 700 కుటుంబాలకు ఏం చెపుతావ్ కేసీఆర్? అని నిలదీశారు. ప్రతి ఏటా యూపీఎస్సీ, ఎస్సెస్సీ, ఎన్డీఏల ద్వారా లక్షలాది ఉద్యోగాలను కేంద్రం భర్తీ చేస్తోందని, అయినా కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మేయడమే అవుతుందని అన్నారు.