ఆంధ్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్నా
రాసుకుపూసుకు తిరుగుతున్న వైనం
గ్రేటర్లో బీజేపీ విజయానికి వైసీపీ గండి!
ఆంధ్రులు ఉన్న చోట్ల టీఆర్ఎస్కు మద్దతు
తెలంగాణలో జగన్ పార్టీకి పూర్వ వైభవం
రెడ్డి సామాజిక వర్గం ఓట్లను చీల్చడానికే
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయాలకు వైసీపీ గండి కొట్టిందని టీఆర్ఎస్ శ్రేణులే చెబుతున్నాయి. చాలా చోట్ల కాషాయ దళం గెలుపును అడ్డుకుందని అంటున్నాయి. ముఖ్యంగా అక్కడ స్థిరపడిన ఆం రఽధులు ప్రభావం చూపే డివిజన్లలో బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు పనిచేశారు. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాలకు చెందిన రెడ్డి, కాపు సామాజిక వర్గాల నేతలు .. ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి బాటలు వేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ గెలిచిన 56 డివిజన్లలో సగం సీట్లు ఇవే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ కడుతున్న పోలవరం, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులను కేసీఆర్ గట్టిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ తన స్వలాభం కోసం ఆంధ్ర సీఎం జగన్మోహన్రెడ్డి.. ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించడానికి రాయలసీమ వైసీపీ నేతలు వారం పది రోజులు అక్కడే మకాం వేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గ్రేటర్లో చేసిన ప్రచారం కూడా కాషాయ పార్టీని దెబ్బతీసింది. ఇవన్నీ అటుంచితే.. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ నుంచి బీజేపీకి మళ్లినట్లు కేసీఆర్ కూడా గ్రహించారు. అందుకే అవి రానున్న ఎన్నికల్లో బీజేపీకి గంపగుత్తగా పడకుండా ఉండేందుకు ఆ సామాజిక వర్గం ఓట్లను చీల్చాలని ఎత్తుగడ వేశారు. వైసీపీని తెలంగాణలో పునరుజ్జీవింపజేస్తే ఆ ఓట్లు చీలిపోతాయని.. అది టీఆర్ఎస్కు లాభిస్తుందని ఆయన అంచనా.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఆం రఽధుల ప్రభావం ఎక్కువ. కూకట్పల్లి జోన్లో 22 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ ఏకంగా 20చోట్ల గెలిచింది. శేరిలింగంపల్లిలో 15 డివిజన్లకుగాను 13 సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ గెలుచుకున్న 56 స్థానాల్లో ఏకంగా 33 ఈ రెండు జోన్లలోనే ఉండటం గమనార్హం. అదే నియోజకవర్గాల వారీగా చూస్తే… కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోటీఆర్ఎస్ 27 డివిజన్లలో నెగ్గింది. జీహెచ్ఎంసీ పోలింగ్‌కు ముందే వైసీపీకి చెందిన కొందరు నేతలు ఈ ప్రాంతాల్లో రహస్య సమావేశాలతో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారని బీజేపీ నేతలు గతంలోనే ఆరోపించారు. నిజానికి 2018 తెలంగాణ శాసనసభ, 2019 ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ పరస్పరం సహకరించుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కాంగ్రెస్, టీడీపీలకు నష్టం జరిగింది. అయితే జీహెచఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైసీపీ అందించిన పరోక్ష సహకారంతో బీజేపీకీ భారీగా నష్టం వాటిల్లింది. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. జీహెచఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావించింది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను గ్రేటర్ ఎన్నికల్లో మట్టి కరిపించి 2023 ఎన్నికల్లో తామే ప్రత్యామ్నాయమని చాటాలనుకుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే బీజేపీ ఎక్కువ డివిజన్లు గెలుచుకున్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే ఆంధ్రులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్కు వైసీపీ మద్దతివ్వడంతో ఆ అవకాశాన్ని కోల్పోయింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య తేడా 8 డివిజన్లు మాత్రమే. మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగానే ఆంధ్రులు ఉన్న నియోజకవర్గాల్లోనూ గెలిచి ఉంటే టీఆర్ఎస్ కంటే ఎక్కువ డివిజన్లు బీజేపీకి వచ్చి ఉండేవి. జీహెచఎంసీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, ఎవరికీ మద్దతూ ఇవ్వబోమని ప్రకటించిన వైసీపీ.. ఆ నాలుగింటితో పాటు ఖైరతాబాద్, సనతనగర్ తదితర నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులను నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ అండ్ కో ఆస్తులు హైదరాబాద్‌లోనూ అధికంగా ఉన్నాయి. వాటిని కాపాడుకునేందుకే జగన్ అక్కడి సీఎంకు సన్నిహితంగా ఉంటున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అలాగే టీడీపీ నేతల ఆస్తులు కూడా అక్కడ ఉన్నాయి. నిరుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆ ఆస్తులపై దాడులు చేస్తామని బ్లాక్మెయిల్ చేసి.. వైసీపీకి మద్దతిచ్చేలా చేశారన్నది బహిరంగ రహస్యమే. ఇందుకు ప్రతిఫలంగా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు జగన్ తన వంతు సహకారం అందించారు. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు తమ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. పనిలోపనిగా తమ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపైనా కంప్లయింట్ ఇచ్చారు. ప్రచారంలో ఆంధ్ర రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేయడమే గాక.. అనవసరంగా చంద్రబాబునూ విమర్శించారు. అమరావతికి బీజేపీ కూడా ద్రోహం చేసిందని ఆంధ్రులు రగిలిపోతున్న తరుణంలో వీర్రాజు ప్రచారం కూడా తమను దెబ్బతీసిందని.. బీజేపీ గ్రేటర్లో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం పోయిందని తెలంగాణ కాషాయ నేతలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కె.లక్ష్మణ్ తదితరులు అధినాయకత్వానికి తెలియజేశారు.
ఇక్కడా రావాలి జగన్!
తెలంగాణలో వరుసగా ఎదురవుతున్న పరాజయాల నేపథ్యంలో.. కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి.. రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే ఎత్తుగడలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా చాలాకాలం క్రితమే తెలంగాణలో కార్యకలాపాలను నిలిపివేసిన వైసీపీ పునరుజ్జీవానికి పావులు కదుపుతున్నారు. బీజేపీని నిలువరించడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో.. ముఖ్యంగా తనను వ్యతిరేకించే రెడ్డి సామాజిక వర్గం ఓట్లను చీల్చడమే లక్ష్యంగా.. కేసీఆర్ ఇటీవల ఆంధ్రకు చెందిన వైసీపీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. తక్షణం తెలంగాణలో వైసీపీ పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని ఆయన వారికి సూచించారు. జగన్మోహన్రెడ్డి తన అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్నప్పుడు, ఆయన సోదరి షర్మిల 2012లో చేపట్టిన పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలోనూ కొనసాగింది. 2014 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలో ఒక లోక్‌సభ స్థానం, మూడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. వైసీపీ తరఫున విజయం సాధించిన ఆ నలుగురూ టీఆర్ఎస్లో చేరారు. అయినప్పటికీ వారిపై వైసీపీ క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచే జగన, కేసీఆర్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. కొత్త ఏడాదిలో వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికన్నా ముఖ్యంగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రానుంది. వరంగల్ కార్పొరేషన్ వదిలేస్తే మిగతావన్నీ వైసీపీకి కొద్దోగొప్పో ఆదరణ ఉన్న ఖమ్మం జిల్లాలో, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీ పరోక్ష సహకారం తప్పనిసరని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో వైసీపీ క్రియాశీలమైతే.. బీజేపీ వైపు మొగ్గుతున్న రెడ్డి సామాజిక వర్గంలో చీలిక వస్తుంది. బలమైన ఈ వర్గం టీఆర్ఎస్ను వ్యతిరేకించే పక్షంలో.. వారి ఓట్లు ఏకపక్షంగా బీజేపీకి పడవు. అవి బీజేపీ, వైసీపీ మధ్య చీలిపోతాయి. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. బలంగా లేని కాంగ్రెస్‌కు పడే అవకాశం లేదు. అవి మొత్తానికి మొత్తంగా బీజేపీకి మళ్లితే… టీఆర్ఎస్ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే, రెడ్డి సామాజిక వర్గంలో ఎంతో కొంత అభిమానం ఉన్న వైసీపీని ఇక్కడ నిలబడేలా చేయాలని.. తెలంగాణలో బీజేపీ మినహా పోటీ ఇచ్చే మూడో పార్టీ లేకపోవడం టీఆర్ఎస్కు నష్టం చేస్తుందని.. వైసీపీ మూడో పార్టీ రూపంలో ఇక్కడ ఉంటేనే మనకు శ్రేయస్కరమన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. సీఎంగా జగన ఏపీలో బిజీగా ఉండడం వల్ల ఆయన సోదరి షర్మిల నాయకత్వంలో వైసీపీకి తెలంగాణలో జవసత్వాలు అందించాలని కేసీఆర్ ఆ పార్టీ ముఖ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు జగన ఏ మేరకు సానుకూలంగా స్పందిస్తారనేది సందేహమే. ఎందుకంటే అక్రమాస్తుల కేసులు ఎదుర్కొంటున్న జగన్.. ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగిరం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే ఇరకాటంలో పడ్డారు. ఈ ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖతో ఆయన దేశవ్యాప్తంగా బద్నాం అయ్యారు. తెలంగాణలో వైసీపీ కార్యకలాపాలు పెంచడం అంటే.. అక్కడ పట్టు బిగించాలని ప్రయత్నిస్తున్న బీజేపీనిబాహాటంగా వ్యతిరేకించినట్లేనని.. కేసీఆర్ విషయంలో బహిరంగ సానుకూలత వ్యక్తం చేయడమంటే బీజేపీతో రాజకీయంగా ఢీ కొట్టడానికి సిద్ధపడినట్లేనని.. ఇది కేంద్ర ంలోని బీజేపీ ప్రభుత్వానికి తెప్పిస్తుందని ఆయన భయపడుతున్నారు. ఆ పరిస్థితిని ఆయన ఎందుకు కొనితెచ్చుకుంటారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.