ఉక్రెయిన్ పై రష్యా దాడులు రోజురోజుకీ తీవ్రతరమవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్యా దాడుల్లో కర్ణాటక విద్యార్థి మృత్యువాతపడగా…మిగతా భారతీయులను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, రష్యా, ఉక్రెయిన్ ల మధ్య నేడు జరగనున్న రెండో విడత శాంతి చర్చలు ఆసక్తికరంగా మారాయి. తమ దేశంపై బాంబులు వేయడం ఆపితేనే చర్చలు ముందుకు సాగుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.
తాము యుద్ధాన్ని నిలువరించే పరిస్థితుల్లో లేమని, తుదికంటా పోరాడుతామని తేల్చి చెప్పారు. పిల్లల భవిష్యత్ కోసం, మా భూమిని, మా ఇంటిని మేం కాపాడుకుని తీరుతామన్నారు. నాటోలో ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వాలని, ఒకవేళ యుద్ధంలో ఉక్రెయిన్ అంటూ ఓడిపోతే.. రష్యా బలగాలు నాటో సభ్య దేశాల సరిహద్దులకు వచ్చి కూర్చుంటాయని వార్నింగ్ ఇచ్చారు. తమకు పట్టిన గతే ఆ దేశాలకూ పడుతుందన్నారు. రష్యాపై ఇప్పటిదాకా పెడుతున్న ఆంక్షలు సరిపోవని, మరిన్ని కఠినమైన ఆంక్షలను విధించాల్సిందిగా ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేశారు.
రష్యాకు తాను నెంబర్ వన్ టార్గెట్ అని గతంలో జెలెన్ స్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీని చంపడానికి 400 మంది ప్రొఫెషనల్ కిల్లర్స్ ను రష్యా పురమాయించినట్టు ఓ సంచలన కథనం వెలువడింది. వాగ్నర్ గ్రూప్ కు చెందిన వారిని పుతిన్ ఆదేశాలపై ఆఫ్రికా నుంచి తీసుకువచ్చారని వెల్లడించారు. 23 మంది అంతర్జాతీయ నేతలను చంపడమే వారి టార్గెట్ అని, అందులో జెలెన్ స్కీ కూడా ఉన్నాడని ఆ కథనంలో వివరించారు. గతంలో పుతిన్ రష్యా గూఢచార సంస్థ కేజీబీ ఏజెంట్ అని, ఈ తరహా సీక్రెట్ ఆపరేషన్లు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వెల్లడించింది.
తన సన్నిహితుడి సాయంతో వాగ్నర్ గ్రూపు ఏర్పాటు చేసిన పుతిన్… కీలక ప్రభుత్వ పెద్దలను హతమార్చేందుకు ప్రొఫెషనల్ కిల్లర్స్ ను వినియోగిస్తుంటాడని అందులో పేర్కొన్నారు. మొత్తం 4 వేల మందిని ఉక్రెయిన్ కు పంపగా, వారిలో 400 మందిని కేవలం జెలెన్ స్కీని చంపడం కోసం నియమించారని కథనంలో వెల్లడించారు.