వైఎస్సార్ కడప జిల్లా…పేరుకు తగ్గట్లుగానే వైఎస్ కుటుంబానికి ఆ జిల్లా పెట్టని కోట. ఇక, జగన్ పోటీ చేసిన పులివెందులలో అయితే వైఎస్ కుటుంబానికి తెలియకుండా ఎవరినీ చీమైనా కుట్టదని అక్కడి ప్రజల నమ్మకం. అటువంటి కంచుకోటలో వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయానా తమ్ముడు, నాటి ప్రతిపక్ష నేత సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురవడం నిజంగా సంచలనం రేపింది. ఆ తర్వాత సీబీఐ విచారణలో వివేకా హత్యకు తెర వెనుక వైఎస్ కుటుంబానికి చెందిన కొందరున్నారని ప్రచారం జరిగింది.
ఇక, దస్తగిరి మొదలు వైఎస్ సునీత వరకు చాలామంది ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఇదే విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కోటలో వైఎస్ తమ్ముడిని హత్య చేయడం సామాన్యమైన విషయం కాదని, అంతఃపుర పెద్ద ప్రోత్సాహం లేకుండా అది అసాధ్యమని చంద్రబాబు అన్నారు. బాబాయ్ హత్య కేసులో జగన్ పూర్తిగా కూరుకుపోయారని షాకింగ్ కామెంట్లు చేశారు.
వివేకా హత్యపై తాజాగా వెలుగులోకి వస్తున్న సంచలన వాంగ్మూలాలతో జగన్ రెడ్డి దోషి అని స్పష్టమవుతోందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది..? అవినాశ్ రెడ్డిపై పన్నెండో కేసు అవుతుంది అంటూ జగన్ వ్యాఖ్యానించడం ఈ హత్యలో అతడి పాత్రను నిరూపిస్తోందని అన్నారు. ఈ కేసును మొదటి నుంచి జగన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించాడని, ముందు తనపై హత్యానేరం అభియోగం మోపి ఎన్నికల్లో ప్రయోజనం పొందాడని ఆరోపించారు.
న్యాయం చేయాలని కోరిన సునీత పట్ల నిర్దయగా వ్యవహరించాడని, ఈ హత్యపై నోరు మెదపకూడదని గ్యాగ్ ఆర్డర్ తేవడం, సీబీఐ విచారణను తప్పుబట్టడం వంటివి ఈ కేసులో జగన్ ప్రమేయాన్ని రుజువు చేస్తున్నాయని చెప్పారు. హత్యను పాత్రధారులకే పరిమితం చేసి సూత్రధారులను బోనులో నిలబెట్టకపోతే వివేకా ఆత్మకు శాంతి కలగదని, సీబీఐ ఈ దిశగా దృష్టి పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.