రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించటం లేదు కానీ రైతుల ఉద్యమం పంజాబ్ లో మాత్రం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఆ మాటకు వస్తే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో దీని ప్రభావం చాలా తక్కువ. అస్సలు లేదనే చెప్పాలి. ఇక్కడి పరిస్థితులకు పూర్తి భిన్నంగా పంజాబ్.. హర్యానా రాష్ట్రాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే నెల రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీ శివారులో నిరసన చేస్తున్న రైతులకు మద్దతుగా పంజాబ్ రగిలిపోతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ను చంపాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు అంటించిన పోస్టర్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మొహాలిలోని సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలో ఈ పోస్టర్ కనిపించింది. సీఎంను చంపితే రూ.10లక్షలు నజరానా ఇస్తామని సదరు పోస్టర్ మీద రాసి ఉంది.
దీంతో.. ఒక్కసారిగా ఉలిక్కి పడిన నిఘా వ్యవస్థ.. ఈ పోస్టర్ ను ఎవరు తయారు చేశారు? ఎక్కడ తయారు చేశారు? ఎవరు అంటించారు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతోంది. ఈ ఉదంతంలో ఒక ఈ మొయిల్ ను గుర్తించినట్లుగా తెలుస్తోంది. దాని ఆధారంగా ఆ పోస్టర్ ను ఎవరు రూపొందించారన్న విషయాన్ని గుర్తిస్తారని చెబుతున్నారు.
అదే సమయంలో పోస్టర్ ను అంటించిన వారిని సీసీ కెమేరా ఫుటేజ్ ద్వారా గుర్తించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. పోలీసులు చాలా సీరియస్ గా ఈ పోస్టర్ కు కారణమైన వారిని అదుపులోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.