గత కొద్దిరోజులుగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఒరవడి వరుసగా మూడోరోజు కొనసాగించారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని.. లేకపోతే తీవ్రస్థాయిలో నష్టం తప్పదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వ అవినీతిపై తాము సుప్రీంకోర్టులో కేసు వేస్తామని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన ఆలోచనలను తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. “ మోడీ తన పాలనలో చేసింది ఏం లేదు. 12శాతం జీడీపీ వృద్ధి ఉండే ఎక్కడైనా ఆరేళ్లలో రెట్టింపు అవుతుంది. ఈ మాత్రం పెరుగుదల కోసం ప్రధాని మోడీ అవసరం దేశానికి లేదు. 2025 నాటికి రూ.5లక్షల కోట్ల ఆర్థిక వృద్ధికి ప్రధాని, ఆర్థిక మంత్రి అవసరం లేదు. అది సహజంగా జరిగేదే. చేతనైతే చైనా, సింగపూర్‌లాగా దేశాన్ని మార్చాలి.“ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
దేశంలో బ్యాంకులను ముంచి పారిపోయిన దొంగలందరూ మోడీకి దోస్తులేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. “రాఫెల్ కుంభకోణం బయటకు రావాలి. అందులో దొంగలు బయటపడాలి. రాఫెల్‌పై రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధవిమానాలను 9.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
ఇదే రాఫెల్ యుద్ధ విమానాలను ఇండోనేషియా దేశం 42 రాఫెల్ యుద్ధవిమానాలను కేవలం 8 బిలియన్ డాలర్లకే కొనుగోలు చేసింది. అంటే భారతదేశం కంటే తక్కువ ధరకే ఇండోనేషియా కొనుగోలు చేసింది. పైగా ఇండోనేషియా 6 విమానాలు ఎక్కువగా కొనుగోలు చేసింది. ఇవన్నీ నిజాలు కాదా“ అని బీజేపీ నేతలను కేసీఆర్ నిలదీశారు.
రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలు తోనే తెలియడంలేదా ఎవడు దొంగ అనేది అని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ ఇలాంటివన్నీ వదిలిపెట్టి నన్ను జైలుకు పంపుతామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారు. వీళ్లను చూస్తే నాకు జాలి కలుగుతోంది. దమ్మున్నవాళ్లయితే నన్ను జైలులో వేసి చూడాలి. అయినా తప్పు చేసినోళ్లే అలాంటి వ్యాఖ్యలకు భయపడతారు. మాకు భయం లేదు. ఎవడు జైలుకు పోతాడో వాడే పోవాలి. నేను ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఢిల్లీలో దీనిపై వందశాతం పంచాయితీ పెడతా. మోడీ ప్రభుత్వ అవినీతిపై తాము సుప్రీంకోర్టులో కేసు వేస్తా.“ అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.