మేము చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాం..ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం…వారు డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తాం…వారు చెప్పేదంతా వింటాం….ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే…వారు మా పిల్లల్లాంటివారు…మేమూ మేమూ మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుంటాం…ఇవి ఏపీ సకల శాఖా మంత్రి సజ్జలతోపాటు, మంత్రి పేర్ని నాని అరిగిపోయిన రికార్డులా గత కొద్ది రోజులుగా చెబుతున్న డైలాగుల్లో మచ్చుతునకల వంటివి. వాస్తవానికి సజ్జల, పేర్ని నాని, ఇతర మంత్రులు చెప్పినవాటిలో ఒకటి మాత్రం నిజం. ఉద్యోగులు ఏం చెప్పినా మంత్రులు, అధికారులు చాలా శ్రద్ధగా వింటారు. కానీ, చివరకు మాత్రం తాము చేయాలనుకున్నదే చేసి ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చకుండా….తీవ్ర అసంతృప్తికి గురిచేస్తారు.
ఏదో మొక్కుబడిగా అరకొర చిన్నా చితకా డిమాండ్లు నెరవేర్చి….నష్టాల్లో ఉన్నాం..సర్దుకోండి అని చెబుతుంటారు. బాబా సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగులా….ఏపీ సర్కార్ చేసింది గోరంత… చెయ్యాల్సింది కొండంత అని మంత్రులతో చర్చలకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఉద్యోగులు అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లిఖిత పూర్వకంగా చర్చలకు రావాలని ఈ రోజు చర్చలకు ఆహ్వనించడంతో…షరా మామూలుగా ఉద్యోగులు కూడా గంపెడాశతో మీటింగ్ కు వెళ్లారు. మంత్రులు కూడా అంతే షరా మామూలుగా…కొత్త సీసాలో పాతసారా మాదిరిగా….కొత్త తరహాలో చర్చలకు పిలిచి…పాత తరహాలోనే అసంపూర్తిగా ముగించడంతో అసంతృప్తితో ఉద్యోగులు వెనుదిరిగారు.
చర్చలకు రావాలంటూ పీఆర్సీ సాధన సమితికి ఏపీ ప్రభుత్వం లిఖితపూర్వక ఆహ్వానం పంపడంతో..తమ అభిప్రాయాలను మంత్రుల కమిటీకి తెలియజేసింది సాధన సమితి. అయితే, గతంలోనూ చాలాసార్లు చర్చలకు వచ్చామని, కానీ, ఈసారి మాత్రం తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తేనే చర్చలపై ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పేసింది. ఆ మాట చెప్పడంతో చర్చలపై మంత్రుల కమిటీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగు సాధనసమితి చెప్పిన దానికి షాక్ కు గురైన మంత్రుల కమిటీ తాము కూడా చర్చించుకుని మళ్లీ వస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందించింది.
అయితే, సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రుల కమిటీ సూచించింది. ఇక, ఉద్యోగులు చెప్పిన విషయాన్ని జగన్ కు చేరవేసేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ నివాసానికి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో, మంత్రుల కమిటీతో ఉద్యోగసంఘాల చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లయింది. అయితే, మంత్రుల కమిటీ ఎదుట మూడు ప్రతిపాదనలను స్టీరింగ్ కమిటీ ఉంచడం..దానిపై చర్చించి మళ్లీ చెబుతామని మంత్రుల కమిటీ చెప్పడం మాత్రమే ఈ భేటీలో చెప్పుకోదగ్గ పాయింట్. ఇక, పీఆర్సీపై అశుతోష్ మిశ్రా రిపోర్ట్ బయటపెట్టాలని స్టీరింగ్ కమిటీ కోరింది. పీఆర్సీ జీవోల రద్దు, పాత జీతాలు వేయాలని స్టీరింగ్ కమిటీ ప్రతిపాదనలు చేసింది. మరి, ఈ వ్యవహారంపై జగన్ తాజా స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.