రివర్స్ టెండరింగ్….ఈ పదాన్ని ఏపీ జనానికి పరిచయం చేసిన ఘనత జగన్ దే. గత ప్రభుత్వం చేపట్టిన ప్రతి పని, ప్రవేశపెట్టిన ప్రతి పథకం అవినీతిమయమన్న భావనలో ఉన్న జగన్….గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీస్తానంటూ రివర్స్ గేర్ లో వచ్చారు. అయితే, ఈ రివర్స్ టెండరింగ్ వల్ల కాంట్రాక్టర్లు వీధిన పడగా…పోలవరం సహా అభిృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా పీఆర్సీ వ్యవహారంలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు..జగన్ బాటలోనే రివర్స్ లో పయనిస్తున్నారు. తమకు జగన్ రివర్స్ పీఆర్సీ ఇచ్చారంటూ గుంటూరులో ఉద్యోగులు వెనక్కు నడిచి నిరసన వ్యక్తం చేసిన ఘటన వైరల్ అయింది.
కొత్త పీఆర్సీ వ్యవహారంపై ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య రచ్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. పీఆర్సీపై ప్రభుత్వం ప్రకటించిన జీవోలను వెనక్కి తీసుకోవాల్సిందేనని పట్టుబట్టిన ఉద్యోగులు ఫిబ్రవరి 3న లక్ష మందితో ఛలో విజయవాడకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనల్లో పాత వేతనాలే ఇవ్వాలని ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వెరైటీగా నిరసన తెలిపేందుకు రివర్స్ లో వెనక్కు నడిచారు ఉద్యోగులు. దీంతో, ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
ఇక, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు , పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. కర్నూలులో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న ఆయన… 30 శాతం పీఆర్సీని సిఫార్సు చేస్తే.. కేవలం 23 శాతమే ప్రకటించడమేంటని నిలదీశారు. పీఆర్సీ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆందోళనలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. శ్రీకాకుళంలో జరుగుతున్న నిరాహార దీక్షలకు సంఘీభావం ప్రకటించిన ఆయన… ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.