సెలబ్రిటీలతో వచ్చే చిక్కే ఇది. ఏదైనా తమకు నచ్చినట్లు చేసేయొచ్చు కానీ.. వారిని ఫాలో అయి.. వారికి స్టార్ డమ్ తీసుకొచ్చే అభిమానుల విషయంలో వారు వ్యవహరించే తీరు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. అందుకు స్టార్ యాంకర్ కమ్ నటి అనసూయనే తీసుకోండి.
ఒక విషయాన్ని ఒక సందర్భంలో ఆగ్రహించే ఆమె.. మరో సందర్భంలో లైట్ తీసుకోవటం ఆమెకే చెల్లుతుంది. తమనను అభిమానించే అభిమానులతో ‘చనువు లేదు’ అని సూటిగా చెప్పేసే ఆమె.. మరేం చనువుతో చాటింగ్ చేస్తున్నట్లు?
నేను మీకు బాగా తెలీదు కాబట్టి ఆంటీ లేదంటే అక్కా అని పిలవొద్దు. నువ్వు అడిగింది ఏజ్ షేమింగ్ కిందకు వస్తుందంటూక్లాస్ పీకింది. ఇంతకీ ఈ ఏజ్ షేమింగ్ గోలేంటి? అంటారా? అక్కడికే వస్తున్నాం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అనసూయ.. తాజాగా సదరు మీడియంలో ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెట్టుకుంది. ఈ క్రమంలో ఒక నెటిజన్ మిగిలిన వారికి భిన్నంగా మిమ్మల్ని ఆంటీ లేదంటే అక్కా? ఎలా పిలవాలి మిమ్మల్ని? అని అడిగాడు.
దీనికి స్పందించిన అనసూయ.. ‘‘ఏదీ వద్దు. నేను మీకు బాగా తెలీయదుకాబట్టి ఆంటీ లేదంటే అక్క అని పిలవద్దు. నువ్వు అడిగింది ఏజ్ షేమింగ్ కిందకు వస్తుంది. దీన్నిబట్టి నీ పెంపకం మీద డౌట్ వస్తుంది’’ అంటూ కస్సుమంది. ఈ సమాధానం కొందరికి నచ్చితే కొందరికి నచ్చలేదు. ఒకరిని మిమ్మల్ని ఆంటీ అని పిలవాలా? అక్కా అని పిలవాలా? అన్న ప్రశ్నలో పెద్ద బూతు ఉన్నట్లుగా తేల్చేసి.. దానికి ఏజ్ షేమింగ్ అంటూ కొత్త ట్యాగ్ పెట్టేయటం ఏమిటన్నది ప్రశ్న.
అనసూయ అనుకున్నట్లుగా కావాలనే అడిగాడనే అనుకుందాం? సదరు నెటిజన్ రెచ్చగొడితే రెచ్చిపోవాలన్న రూల్ లేదుగా? ఒకవేళ అతను.. నిజంగానే కన్ఫ్యూజన్ తో అడిగి ఉంటే.. నీకు ఏమనిపిస్తే అలా పిలవొచ్చు.. అన్న మాట అంటే సొమ్ములేమీ పోవు కదా?ఒకవేళ.. అలా కూడా ఎందుకు చెప్పాలి? నాకు నచ్చినట్లే చెబుతా? అంటే.. ఏదీ వద్దు అని చెప్పి వదిలేస్తే సరిపోయేది కదా?
కానీ.. ఏదైనా మాట్లాడినంతనే క్లాస్ పీకటం.. కస్సుమని రియాక్టు కావటం సెలబ్రిటీలకు ఈ మధ్యన ఎక్కువైంది. నేను మీకు బాగా తెలియదు అన్న అనసూయ.. మరి.. తాను ముచ్చట్లు పెట్టే వారి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నట్లు? అన్నది ప్రశ్న.
అక్కా? ఆంటీ? ఏమని పిలవాలి అన్న ప్రశ్నకే.. నీ పెంపకం మీద డౌట్ వస్తోందని అనటం ద్వారా.. అతగాడి తల్లిని అవమానించటం కాదా? ఒకవేళ కుర్రాడు తప్పు చేశాడనే అనుకుందాం. దానికి అతడి తల్లి చేసిన తప్పేంటి? ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏ మాత్రం సంబంధం లేని నెటిజన్ తల్లిని లాగేయటంలో అర్థం లేదు కదా?
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవాలంటే.. సెలబ్రిటీలు తమ సోషల్ పేజీల్లో మాటలు మాట్లాడుకోవటం.. పోస్టులు.. ఫోటోలు.. వీడియోలు లాంటివి పెట్టుకోవటం అంటే.. తమను తాము ప్రమోట్ చేసుకోవటమే. తమ పేజీకి ఇమేజ్ పెంచుకోవటం లాంటిదే.
అంటే.. ఒక విధంగా ప్రజల్లో తనకున్న క్రేజ్ ను సొమ్ము చేసుకోవటమే. అంతే.. తనకున్న పాపులార్టీతో తన పేజీకి వచ్చే ట్రాఫిక్ ఆధారంగా ఆదాయాన్ని పొందుతున్నారన్నది మర్చిపోకూడదు. అందుకు సహకరిస్తున్న ఆమె అభిమానులంతా ఆమెకు చక్కటి వినియోగదారులన్నది మర్చిపోకూడదు.
అలాంటప్పుడు నీ పెంపకం మీద డౌట్ వస్తుందన్న పెద్ద మాటను ఉత్తి పుణ్యానికే.. అది కూడా అక్కా అని పిలవాలా? ఆంటీ అని పిలవాలా? అన్న ప్రశ్నకు స్పందించటం సరికాదు. అనసూయ ఇచ్చిన ఆన్సర్ కొందరు నెటిజన్లకు సైతం నచ్చలేదు.
ఒకరిని అక్క అని పిలవటం ఏజ్ షేమింగ్ కాదు. అలాంటప్పుడు కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవద్దని పేర్కొనటంతో దానికి బదులిచ్చిన అనసూయ.. ‘బహుశా ఏజ్ షేమింగ్ కాకపోవచ్చు. అయితే.. మీరు నా ఉద్దేశాన్ని గమనించారు. నేను ఏం చప్పానో మీకు బాగా తెలుసు. నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. నన్ను ఎవరు అక్క అని పిలవాలి?ఎవరు పిలవకూడదు? అనే విషయంలో వాళ్లిద్దరు చాలా పోసెసివ్.
ఇక.. కాంప్లిమెంట్స్ తీసుకోవాలా? వద్దా? అనేది ఒకరి ఇష్టం కాదా? ఒక నావ సముద్రం మీద ఈదగలదు. అదే నావ.. సముద్రాన్ని తన లోపలికి రానిస్తే.. మునిగిపోతుంది. అందువల్ల జనసముద్రం నుంచి ఏది ఎంత కావాలో.. తీసుకోవాలో నాకు తెలుసు’ అంటూ ఆన్సర్ ఇచ్చింది.
ఇన్ని తెలిసిన అనసూయ.. మరో నెటిజన్ మీరు బాగా లావు అయ్యారని కామెంట్ చేస్తే థ్యాంక్స్ అని బదులిచ్చారు. మరి.. అప్పుడు బాడీ షేమింగ్ అనిపించాలి కదా? అందుకు క్లాస్ పీకాలి కదా? తన ఇంట్లో తన ఇద్దరు సిస్టర్లు ఏం అనుకుంటారు. వారిది విశాలమైన మనసా?. పొసెసివా? లాంటి సమాచారం అభిమానకోటికి తెలీదు కదా?
ఇదంతా ఎందుకు తన క్రేజ్ ను పెంచుకోవటానికి మరోసారి ముచ్చట్లు పెట్టే వేళలో.. డిస్ క్లేమర్.. విధి విధానాలు.. పరిమితులు లాంటివి స్పష్టంగా పేర్కొని.. ఆ తర్వాత మాట్లాడమని చెబితే బాగుంటుందేమో అనసూయ. కాస్త ఆలోచించండి.