అడగనిదే అమ్మయినా పెట్టదు…కానీ, అడిగినవి ఇవ్వకుండా….అడగనివి కూడా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేవారే జగన్. ఫిట్ మెంట్ 33 శాతానికి పెంచండి, సీపీఎస్ రద్దు చేయండి అంటూ మొర పెట్టుకున్నా వినని జగన్…అడగకుండానే అందరూ అవాక్కయ్యేలా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచడంతో ఉద్యోగులు సంతోషించారు. కానీ, ఆ పెంపు వెనుక ఉన్న ముప్పును…జగన్ మాస్టర్ ప్లాన్ ను మాత్రం గ్రహించలేకపోయారు. ఇలా ఈ వయసు పెంపుతో జగన్ ఒకే దెబ్బకి నాలుగు పిట్టలు కొట్టారన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే అర్థమయ్యే విషయం.
మొదటి పిట్ట
రిటైర్మెంట్ బెనిఫిట్ కింది భారీగా మొత్తంలో ఆ ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించాలి. ఏపీ ఖజానా ఖాళీ అయిన నేపథ్యంలో అది శానా కష్టం. కాబట్టి మరో రెండేళ్లు సర్వీస్ పొడిగిస్తే.. 2024 ఎన్నికలు వస్తాయి. అప్పుడు రాజెవరో..జగన్ రెడ్డెవరో.
రెండో పిట్ట
ఆఫీసులో ఓ పెద్ద తలకాయ రిటైర్ ఐతే కనీసం నలుగురికి ప్రమోషన్ వస్తుంది. కాబట్టి ప్రమోట్ అయిన వారికి జీతం, అలవెన్సులు గట్రా పెంచాల్సి ఉంటుంది. కాబట్టి రిటైర్ కాకుండా చేస్తే….ఈ డబ్బులు కూడా మిగులుతాయి.
మూడో పిట్ట
ఇక, ఉద్యోగులు రిటైర్ అయితే దాదాపుగా ప్రతి శాఖలోనూ భారీగా ఖాళీలు వస్తాయి. వాటిని మళ్ళీ భర్తీ చెయ్యాలంటే ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి…కొత్త ఉద్యోగులను పెట్టుకోవాలి. ఉన్న ఉద్యోగులకే జీతాలివ్వలేకపోతుంటే మళ్లీ కొత్త ఉద్యోగులు అనవసరం. కాబట్టి రిటైర్మెంట్ అస్త్రం ప్రయోగిస్తే ఈ సమస్య ఉండదు.
నాలుగో పిట్ట
ఉద్యోగ సంఘాలలో ఉన్న కీలక నేతలంతా దాదాపుగా రిటైర్మెంట్ దగ్గర పడ్డవాళ్లే. వారి ఉద్యమ వేడిని చల్లార్చాలంటే మరో రెండేళ్లు సర్వీస్ పెంచితే చాలు. ఆ పెంపుతో వాళ్లంతా గమ్మునుంటారు…మిగతా వారికీ నచ్చజెపుతారు. కాబట్టే పీఆర్సీ, సీపీఎస్ అంటూ హడావిడి చేసిన నేతలు కూడా రిటైర్మెంట్ ఏజ్ పెంపు అనగానే సైలెంట్ అయ్యారు. ఇదండీ జగన్ రచించిన ఒక దెబ్బ నాలుగు పిట్టల కథ. ఇది తెలియని ఉద్యోగులు మాత్రం సంబరాల్లో మునిగి తేలడం కొసమెరుపు.