తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఇప్పటికే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మాటల దాడి చేస్తుండగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా స్పీడు పెంచుతున్నారు. అయితే…. రేవంత్, సంజయ్‌ల విమర్శలను కేసీఆర్, కేటీఆర్ సహా టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా తిప్పికొడుతున్నారు. కానీ, షర్మిల విషయంలో మాత్రం ఎందుకో గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నారు. పార్టీ దిగువ శ్రేణి నాయకులు, కార్యకర్తలలో షర్మిల తెలంగాణలో ఎవరు వదిలిన బాణమో అర్థం కాక అయోమయం ఉంది. ఇదే అదనుగా షర్మిల కీలక అంశాలపై కేసీఆర్‌ను ఇరుకునపెట్టేలా తీవ్రమైన విమర్శలే చేస్తున్నారు.
తాజాగా షర్మిల.. కేసీఆర్ వామపక్ష నేతల భేటీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిల్లీ ఏలే ప్లాన్లతో మీటింగు పెట్టుకోవడానికి టైం ఉంటుంది కానీ తెలంగాణ రైతుల చావులను పట్టించుకోవడానికి టైం లేదా అంటూ ఆమె ప్రశ్నించారు.
నిన్న కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం నేతలతో.. కేసీఆర్ సమావేశం నేపథ్యంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంట గెలువనోడు రచ్చ గెలుస్తాడా? అని ఆమె ప్రశ్నించారు. మీరు ఇక్కడి రైతులనే ఆదుకోనప్పుడు, రైతుల పాలిట రాక్షస పాలన చేస్తున్న ఈ రైతు ద్రోహి ప్రభుత్వానికి దేశం పట్టం కడుతుందా ? అని మండిపడ్డారు.
రైతుబంధు ఇచ్చి రైతులకు ఉపాధి చూపుతున్నాం అన్న దొరగారి గప్పాలు నిజమైతే మొన్న ఇద్దరు, నిన్న నలుగురు, ఇవాళ ఒక్కరు… పెట్టిన పెట్టుబడి రాక, అప్పుల బాధతో పంట నష్టపోయి ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటారు ? అని నిలదీశారు. రైతు ఆత్మహత్యలను ఆపడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు అని షర్మిల ధ్వజమెత్తారు.
కాగా కేసీఆర్‌ను కలిసేందుకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వచ్చినా కూడా తెలంగాణ సీపీఎం నేతలు మాత్రం ఒక్కరు కూడా రాలేదు.
దీంతో కేసీఆర్ ఎన్ని పెద్ద అంగలు వేసినా సరే రాష్ట్రంలో మాత్రం అడుగడుగునా మేం అడ్డుపడతాం అని స్థానిక సీపీఎం నేతలు మెసేజ్ పంపినట్లయింది.
మొత్తానికి రానున్న ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీజేపీలే కాదు అందరి నుంచీ కేసీఆర్‌కు కఠిన పరీక్ష తప్పేలా లేదు.