తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఆ పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రేపిన రచ్చబండ కాక ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంలో వేళ్లన్నీ తనవైపు చూపిస్తుండడంతో పార్టీపై తన భక్తిని చాటుకునే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తాను ఏ పార్టీకి కోవర్టును కాదని ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన జగ్గారెడ్డి.. అవసరమైతే ఇండిపెండెంట్‌గా మిగిలిపోతానని కానీ పార్టీకి మాత్రం నష్టం చేయనని తాజాగా పేర్కొన్నారు. పార్టీలో అంతర్గతంగా సమస్యలు ఉన్నాయని కానీ పార్టీపై ప్రభావం చూపే పనులు మాత్రం చేయనని ఆయన తాజాగా సుస్పష్టం చేశారు.
తన సొంత జిల్లాలో రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చిన రచ్చబండ కార్యక్రమానికి తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రేవంత్ రెడ్డి మైండ్‌సెట్ మార్చుకోవాలని ఆదేశించాలని లేని పక్షంలో మరొకరిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని ఆయన అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ సమావేశంలో పెద్ద రచ్చ జరిగింది. ఓ దశలో తీవ్ర అసహనానికి గురైన జగ్గారెడ్డి పార్టీ నుంచి తప్పుకుంటానని కూడా పేర్కొన్నారు. ఆ తర్వాత వీహెచ్ హనుమంతరావు, భట్టి, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డి .. జగ్గారెడ్డితో మాట్లాడి ఆయన్ని సముదాయించారని తెలిసింది.
ఈ నేపథ్యంలో సోనియా, రాహుల్ గాంధీలను కలిసేందుకు జగ్గారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వాళ్ల అపాయింట్మెంట్ అడుగుతానని ఆయన పేర్కొన్నారు. జీవితాంతం సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో పని చేస్తానని చెప్పారు. తన వల్ల పార్టీలో ఎవరైనా ఇబ్బందులు పడితే ఇండిపెండెంట్‌గా ఉంటా తప్ప మరో పార్టీలోకి వెళ్లనని బల్లగుద్ది మరీ తెలిపారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకం తనకుందని ఆయన చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మరోసారి రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
“పార్టీని డ్యామేజీ చేయాలనే ఆలోచన నాకు లేదు. నన్ను ఎవరు డ్యామేజీ చేయాలని చూసినా కాంగ్రెస్‌ను వీడాలని లేదు. నా రాజీనామాపై వస్తున్న వార్తలను సమర్థించను. అలా అని ఖండించను. నాతో వీహెచ్, భట్టి, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. కానీ ఆ విషయాలు బయటకు చెప్పా. కాంగ్రెస్ నా జాగిరి కాదు. రేవంత్ రెడ్డి జాగిరి కాదు. అది సోనియా జాగిరి. ఈ నెల 20 తర్వాత భవిష్యత్ కార్యచరణ ఉంటుంది” అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20 తర్వాత ఆయన ఎలాంటి అడుగులు వేస్తారోనన్న ఆసక్తి నెలకొంది.