వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య ఒకటి సెగ పుట్టిస్తోంది. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశాన్ని ఆయన మాటలు చెప్పకనే చెప్పేసినట్లుగా ఉన్నాయి. రాష్ట్రంలోని పరిస్థితులపై ఒక్క లైనులో ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పోలీసులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
రాష్ట్రంలో నక్సలిజం.. టెర్రరిజం బాగా తగ్గిందని.. లోకల్ మాఫియా మాత్రం చెలరేగిపోతోందన్నారు. కొందరు పోలీసులు సైతం లోకల్ మాఫియాతో చేతులు కలిపారని.. దీంతో సామాన్యులకు భద్రత లేకుండా పోతుందన్న ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటగిరి తొమ్మిదో బెటాలియన్ లో జరిగిన స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాను పోలీసులందరిని తప్పు పట్టటం లేదని.. కొందరు స్వార్థ పరులతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రజల్లో నమ్మకం.. భరోసా కల్పించాల్సిన పోలీసులే ఇలా లోకల్ మాఫియాతో చేతులు కలపటం బాధాకరమన్న ఆయన.. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం సామాన్యుల్లో రోజురోజుకు సన్నగిల్లుతుందన్నారు. ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరిపారేస్తేనే సమాజం బాగుపడుతుందన్నారు. ‘పోలీసులు.. మాఫియా కలిశాక సామాన్యులకు భద్రత ఇంకెక్కడ ఉంటుంది? నేను పోలీసులు అందరిని నిందించటం లేదు. కొందరి గురించి మాత్రమే చెబుతున్నా’ అంటూ ఆనం వ్యాఖ్యానించారు.
అధికార పక్షానికి చెందిన సీనియర్ నేత నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి నోట నానుతున్నాయి. ఇప్పటికే ఏపీ పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఈ వాదనకు బలం చేకూరేలా అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు నేరుగా.. పోలీసు శాఖకు సంబంధించిన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు.. వాస్తవ పరిస్థితిని ఎత్తి చూపిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.
ఆనం వ్యాఖ్యలు సొంత పార్టీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపినట్లే అవుతుందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ మాఫియా రెచ్చిపోతున్నా.. వారిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నట్లు చెప్పారు. పోలీసులు న్యాయం చేస్తారని ప్రజల్లో ఒక నమ్మకం.. భరోసా పోతుందని వాపోయారు. ఇదే జిల్లాకు చెందిన కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైతం గతంలో పోలీసుల తీరును తప్పు పట్టారు.
మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులపై పోలీసులు కేసులు పెట్టటాన్ని ఆయన అప్పట్లో తప్పు పట్టారు. చేతనైతే ధాన్యం కొనని మిల్లర్లు.. దళారులపై కేసులు పెట్టాలే కానీ.. రైతుల మీద చర్యలు తీసుకోవటం ఏమిటని తప్పు పట్టారు. ఇప్పుడు పోలీసుల తీరుపైనా అధికారపార్టీకి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే వేలెత్తి చూపించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.