వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నిల్లో పోటీ చేయాలని ఎంఐఎం తాజాగా నిర్ణయించింది. కనీసం 20 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ప్రధాన లక్ష్యంగా ఎంఐఎం ఇఫ్పటి నుండే జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తక్కువలో తక్కువ 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఇదే విషయమై పశ్చిమబెంగాల్లోని నేతలతో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పెద్ద భేటీనే జరిపారు.
బెంగాల్లో పార్టీ పోటీ చేయటానికి ఉన్న అవకాశాలేమిటి ? గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ? ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలేంటి ? అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మొన్ననే జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఐదుగురు అభ్యర్ధులు ఎంఎల్ఏలుగా గెలిచిన విషయం తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీచేస్తే ఐదుగురు గెలిచారు. మిగిలిన 20 నియోజకవర్గాల్లో మహాఘట బందన్ (ఎంజీబీ) అభ్యర్ధుల ఓటమికి కారణమయ్యారు. దాంతో బీహార్ లో అధికారానికి ఆర్జేడీ ఆమడదూరంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే.
ఇంతకు ముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన ఎంఐఎం 4 ఎంఎల్ఏలను గెలిపించుకున్నది. దాంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించాలని ఎంఐఎం డిసైడ్ చేసుకున్నది. సో వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమబెంగాల్ ఎన్నికల్లోనే కాకుండా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయటానికి రెడీ అయిపోతున్నది.
బెంగాల్ లోని సీమాంచల్, 24 పరగణాలుతో పాటు అసన్ సోల్ లాంటి ప్రాంతాల్లోని నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో గెలుపుపై జాగ్రత్తగా పావులు కదుపుతోంది. బీహార్లో కూడా ఇలాగే ప్లాన్ చేసి విజయం సాధించింది. తాజాగా ఎంఐఎం నిర్ణయం తెలియగానే అధికార తృణమూల్ కాంగ్రెస్ లో కలవరం మొదలైనట్లే ఉంది. ఎందుకంటే బీజేపీకి పడాల్సిన ఒక్క ఓటు కూడా ఎంఐఎంకు పడవు. కానీ టీఎంసీకి పడాల్సిన ఓట్లు కచ్చితంగా అసద్ పార్టీకి పడే అవకాశాలుంటాయి. ఎంఐఎం పోటీ చేయడం అంటే బీజేపీకి ప్లస్సవడానికే అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఎందుకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఎంఐఎం గెలవలేకపోయినా ప్రత్యర్ధుల్లో ఎవరో ఒకరి గెలుపు అవకాశాలను దెబ్బతీయటం ఖాయమని అర్ధమవుతోంది. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. అధికార టీఎంసీ-బీజేపీ మధ్య రోజురోజుకు పెరిగిపోతున్న వివాదాల నేపధ్యంలో బహుశా అధికారపార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఒకపుడు కేవలం ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమైన ఎంఐఎం పార్టీ ఆశలు మెల్లిగా అయినా నెరవేరేట్లే ఉంది చూస్తుంటే.