కేవలం అమరావతే రాజధానిగా ఉండాలని నిరసన తెలుపుతున్నారన్న ఒకే ఒక్క కారణంతో అమరావతి రైతులను ఏపీ ప్రభుత్వం నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. అమరావతిలో నిరసనలను అడ్డుకోవడం మొదలు…మహా పాదయాత్రలో రకరకాల కారణాలతో యాత్రకు భంగం కలిగించేలా చేయడం వరకు జగన్ సర్కార్ చేసిన చర్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా..రైతులు చేపట్టిన యాత్రను దిగ్విజయంగా ముగించారు.
అయినా సరే రైతులను ఇంకా ఇబ్బంది పెట్టాలనే క్రమంలోనే తిరుపతిలో రైతులు తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో, వారంతా హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా తిరుపతి రూరల్ లో అమరావి రైతుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా అమరావతి జేఏసీ తలపెట్టదలిచిన బహిరంగ సభకు కోర్టు అనుమతినిచ్చింది.
తిరుపతి రూరల్ పరిధిలో జేఏసీ బహిరంగ సభ నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. మధ్యాహ్నం 1 గంట నుండి 6 గంటల వరకు సభను కోవిడ్ నిబధనలు పాటిస్తూ జరుపుకోవాలని అనుమతిచ్చింది. అయితే, తిరుపతిలో సభ పెడితే లా&ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పాదయాత్ర సమయంలో పోలీసులపై అమరావతి రైతులు దాడి చేశారని వీడియోను చూపించారు.
అంతేకాదు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఏఏజీ వాదించారు. ఒమిక్రాన్ కేసుల నేపధ్యంలో సభకు అనుమతించలేదని తెలిపారు. అయితే, ప్రైవేటు ప్రదేశంలో సభను నిర్వహించుకుంటే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రభుత్వం, అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రైతులకు హైకోర్టు సూచించింది.