ఏపీ రాజకీయాల్లో తరచూ హాట్ టాపిక్ గా మారుతుంటారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సాధారణంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడన్నప్పుడు ప్రజల్లో అంతో ఇంతో పలుకుబడి ఉండటం కనిపిస్తుంది. కానీ.. సోము కథ వేరుగా చెప్పాలి. ఆయన ఏపీలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించేంత సీన్ లేదు. అలా అని.. ఆయనకంటూ ప్రత్యేక ఫాలోయర్స్ కూడా ఉండరు. అవేమీ లేకుండానే ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెలామణీ కావటం.. అది కూడా ఏళ్లకు ఏళ్లుగా కావటం ఆయనకు మాత్రమే చెల్లుతుందేమో? తాజాగా ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో సంచలన ప్రకటన చేశారు.
పార్టీ కార్యక్రమాలు.. భవిష్యత్ కార్యాచరణ మీద మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన ప్రకటన చేసి.. అందరిచూపు తన మీద పడేలా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లుగా ప్రకటించారు. తనకు పదవుల మీద ఆశ లేదని.. 42 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉన్నానని.. 2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని.. తమ పార్టీకే పాలించే సత్తా ఉందంటూ చిత్రమైన వాదనను వినిపించారు.
రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. ఏపీ ప్రజల హక్కుగా భావించే విశాఖ ఉక్కునుప్రైవేటు పరం చేయటంతో పాటు.. గడిచిన ఏడున్నరేళ్లలో ఏపీకి ఏమీ ఒరగబెట్టని బీజేపీని.. ఏపీ ప్రజలు ఏ రీతిలో అధికారాన్ని అప్పజెబుతారు? అన్న ప్రాథమిక ప్రశ్న వేసుకోకుండానే మాట్లాడటం సోముకు మాత్రమే చెల్లు. గతంలో పదవులు పొందే అవకాశం వచ్చినప్పుడు తాను రిజెక్టు చేశానని చెప్పారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు బీజేపీలోకి చేరనున్నట్లుగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారిన వేళ.. సోము చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
రఘురామ మీద అవినీతి కేసులు ఉన్నాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు.. 2019లో ఆయనకు ఎంపీ టికెట్ ను పార్టీ తరఫున ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. వైసీపీ సర్కారు వైఫల్యాల్ని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ కడిగేశారన్న ఆయన.. ఆ స్క్రిప్టును చంద్రబాబు స్టేట్ మెంట్ గా వైసీపీ నేతలు ఆరోపించటాన్ని సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు.
ఎవరో రాసిస్తే.. కనీస జ్ఞానం లేకుండా చదివేయటం తమ మంత్రులు చేయరన్నారు. కేంద్రమంత్రిని తప్పు పడుతున్న వైసీపీ నేతలు.. అదే కేంద్రమంత్రి తిరుమలకు వస్తే మాత్రం ప్రసాదాలు ఇస్తున్న వైనాన్ని గుర్తు చేశారు. అన్నమయ్య డ్యామ్ కట్ట తెగిన వెంటనే ఎందుకు కమిషన్ వేయలేదని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్న 18 రాష్ట్రాల్లో ఎలాంటి అవినీతికి అవకాశం ఇవ్వకుండా పాలన సాగిస్తున్నామన్నారు.
అంగన్ వాడీలకు గుడ్లను కూడా అందించలేని దీన స్థితి నెలకొందన్న సోము.. ఒక జిల్లా ఎస్పీకి ఎర్ర చందనం మాఫియా నుంచి నెలకు రూ.5 కోట్లు వస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపు ఇస్తున్నట్లు చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ సోము మాష్టారు.. మీరు కోరుకున్నట్లే.. 2024 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. మీరు రిటైర్మెంట్ తీసుకోవటం బాగుంటుందంటారా? అధికారంలోకి తీసుకొచ్చి మరీ పక్కకు తప్పుకుంటారా? అది నిజమేనంటారా సోము?