నందమూరి నటసింహం ‘అఖండ’ సినిమాతో జూలు విదిల్చిన సంగతి తెలిసిందే. మాస్ కా బాప్ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంలో టాలీవుడ్ కు కొత్త ఊపిరి పోశఆరు. ఈ సినిమా మన దేశంతో పాటు ఓవర్సీస్ లోనూ దుమ్మురేపుతోంది. రికార్డు ఓపెనింగ్స్ తో కనీవిని ఎరుగని రీతిలో కలెక్షన్ల సునామీ రేపుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ‘అఖండ’ విజయంపై బాలయ్యబాబు స్పందించారు.
చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్న మేమే…అని బాలయ్య అన్నారు. ఈ విజయం తమ చిత్ర యూనిట్ ఒక్కరిదే కాదని, ఇది చలన చిత్ర పరిశ్రమ విజయమని చెప్పారు. తాను కేవలం దర్శకుడి సూచనలను పాటిస్తానని, తనకు అన్ని సినిమాలు సమానమేనని చెప్పారు. ‘ఆనాడు రామయణాన్ని రాసిన వాడు వాల్మీకి. ఈనాడు అఖండ సినిమాను ఇంత బాగా తీర్చిదిద్దినవాడు బోయపాటి అంటూ ఆకాశానికెత్తేశారు.
ఒకనాడు భక్తిని రామారావు బతికించారని, ఈనాడు సినిమాను బతికించింది భక్తి అని, భావితరాలకు భక్తి అంటే ఏంటో తెలియజేస్తామని అన్నారు. ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతోన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన బాలయ్య…మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు. కరోనాను కూడా లెక్కచేయకుండా 21 నెలల పాటు షూటింగ్ చేసిన ఫలితమే ఇదని అన్నారు.