#WATCH Karnataka ACB recovers approximately Rs 13 lakhs during a raid at the residence of a PWD junior engineer in Kalaburagi
(Video source unverified) pic.twitter.com/wlYZNG6rRO
— ANI (@ANI) November 24, 2021
అవినీతి అక్రమార్కుల తాట తీస్తూ.. దొంగ సొమ్ము లెక్క తేల్చే ఐటీ అధికారులకు దిమ్మ తిరిగిపోయే ఉదంతం ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్న ఒక అధికారి ఇంట్లో నిర్వహించిన తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీనికి కారణం.. దోచిన సొమ్మును దాచిన తీరే.
సినిమా సీన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి చెందిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..
ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. అవినీతి అధికారులకు తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం అవినీతిని ఉపేక్షించదని.. అవినీతి అధికారుల సంగతి చూస్తామని చెప్పారు. ఆయన నోటి నుంచి ఈ తీవ్రమైన హెచ్చరిక వచ్చిన కొద్ది రోజులకే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400 మంది అధికారులతో కలిపి పలు విభాగాలకు చెందిన ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో అందరి కంటే హాట్ టాపిక్ గా మారారు ప్రజా పనుల శాఖ అధికారిగా వ్యవహరిస్తున్న శాంతగౌడ్ బిరాదార్. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అధికారి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. సోదాల సమయంలో ఇల్లు మొత్తం గాలించినా ఏమీ దొరకలేదు. తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారానికి.. వాస్తవానికి మధ్య తేడా ఉండటం అధికారులకు పాలుపోలేదు. కలబురగి ప్రజా పనుల శాఖలో అధికారిగా వ్యవహరించే ఆయన ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన ఐటీ అధికారులకు.. రోటీన్ కు భిన్నంగా డ్రైనేజీ పైపులు అదనంగా ఉండటంతో అనుమానం వచ్చింది. వెంటనే ప్లంబర్ ను పిలిపించి.. పైపుల్ని తొలగించి చూస్తే.. అందులో నోట్ల కట్టలు భారీగా ఉండటంతో అవాక్కు అయ్యారు.
పైపుల్లోకి కర్రల్ని జొప్పించి.. కిందకు తోస్తే.. నోట్ల కట్టలు దొర్లుకుంటూ వచ్చాయి. వాటిని ఒడిసిపట్టుకోవటానికి వీలుగా బకెట్లు పెట్టాల్సి వచ్చింది. డ్రైనేజీ పైపుల్లో కట్టల కొద్దీ నగదు మాత్రమే కాదు బంగారం కూడా బయట పడింది. కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 60 చోట్ల ఏసీబీ.. ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మొత్తం 15 మంది అధికారుల్ని టార్గెట్ చేశారు. బెంగళూరు నగరంతో పాటు రూరల్.. మండ్య.. కలబురగి.. బళ్లారి.. మంగళూరు.. గదగ్.. బెళగావి.. గోకాక్.. డొడ్డ బళ్లాపుర తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో నాలుగో తరగతి ఉద్యోగుల వద్ద కోట్లాది ఆస్తులు బయటకు వచ్చాయి. సోదాలు నిర్వహించిన ఉద్యోగుల ఇళ్లల్లో లెక్కలోకి రాని నగదు.. నగలు.. ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సోదాలన్నింటిలోనూ హైలెట్ మాత్రం ఇంటి డ్రైనేజీ పైపులో దాచిన నోట్ల కట్టలుగా చెప్పాలి.