ఇటీవల శివం రోడ్ నుంచి విద్యానగర్ వైపు వెళుతూ ఎందుకో కుడి పక్కన చూస్తే హిల్టన్ కేఫ్ కనిపించలేదు…
చాలా ఏళ్ల క్రితమే మూసివేశారు అనే విషయం గుర్తుకు వచ్చింది.
దశాబ్దాలపాటు క్యాంపస్ రాజకీయాలు, స్నేహాలకు అడ్డాగా నిలిచిన కేఫ్ కనుమురుగు కావడం అయ్యో అనిపించింది. ఆరోజు ఎందుకో కొంత తీరిక దొరికింది. ఒక దశాబ్దంన్నరపాటు నేను తిరిగిన ఏరియాలో ఎన్ని కేఫ్‌లు బతికి ఉన్నాయో చూద్దాం అని ముందుకు కదిలా….
హైదరాబాదీయులకు ఇరానీ కేఫ్‌లతో విడదీయరాని అనుబంధం ఉంది….
ఇక్కడ ముత్యాలు ఎంత ఫేమసో ఇరానీచాయ్, బిర్యానీ అంతే ఫేమస్..
ఇప్పుడు ముత్యాలు లేవు….., ఇరానీ కేఫ్‌లు లేవు….
హైదరాబాద్ చరిత్రలో ఇరానీ కేఫ్‌లకు కొన్ని పేజీలు కేటాయించాల్సిందే. లేకుంటే అది అదూరానే.
ఐటి బూమ్ వచ్చే వరకు ఇరానీ కేఫ్‌లో అడ్డా బిఠాయించని వ్యక్తి నగరంలో లేడంటే అతిశయోక్తి కాదు..
హైదరాబాద్‌లో చాలా ప్రాంతాలకు లాండ్మార్కులు ఇరానీ కేఫ్‌లే ఉండేవి. ఓల్డ్‌సిటీలో మదీనా, షాదాబ్, చార్మినార్ ముందు ఫరాషా, ఇప్పుడు నిమ్రా, సికింద్రాబాద్‌లో బ్లూ సీ, రైల్వేస్టేషన్ సమీపంలో ఆల్ఫా, క్లాక్ టవర్ దగ్గర గార్డెన్, ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రెన్్సలో ఎన్సిసి వద్ద హిల్టన్, నల్లకుంట గోల్డెన్ కేఫ్, సైదాబాద్‌లో జైహింద్ ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు….
1995 ప్రాంతంలో ఒక్క సర్దార్ పటేల్ రోడ్లోనే దాదాపు 100 ఇరానీ కేఫ్‌లు ఉండేవి. ఇప్పుడు ఏడెనిమిది ఉంటే గొప్ప, హైదరాబాద్‌లో ఎటువైపు ఒక కిలోమీటర్ ఫ్రయాణించినా ఓ డజను కేఫ్‌లు కనిపించేవి.
ఇప్పుడు పది కిలోమీటర్లు వెళ్లినా ఒక్క కేఫ్ ఉండడం లేదు. పారడైస్లో ఇప్పుడు చాయ్ లేదు. అది బిర్యానీ పాయింట్ మాత్రమే. అయితే న్యూ సిటీతో పోలిస్తే ఇప్పటికీ ఓల్డ్ సిటీలో కొంతమేరకు కేఫ్‌లు బతికి ఉన్నాయి.
అప్పట్లో కాలేజ్ స్టూడెంట్ నుంచి కోటిశ్వరుడి వరకు అవే అడ్డాలు….
పొద్దున లేస్తే ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ కడుపులో పడాల్సిందే.
గరీబైనా… నవాబైనా అదే ఆదత్..
మధ్యాహ్నం అయిందంటే ఐదు నుంచి పది రూపాయలకే దాల్, చావల్ మీల్స్.
అన్నం, పప్పు, కూరతోపాటు మిర్చి లేదంటే ఓ సమోసాతో భోజనం. రోజు కూలీల నుంచి కాలేజ్ స్టూడెంట్స్ లంచ్ అదే.
అందుకే పది రూపాయలు సంపాదించేవాడి దగ్గర నుంచి పది లక్షలు సంపాదించేవాడి వరకు బతకగలిగే అతికొద్ది నగరాల్లో హైదరాబాద్ ఒకటి.
హైదరాబాదీయులకు ఒక్క ఇరానీ చాయ్ పడితే వచ్చే ఆ కిక్కే వేరు.. దాని కోసం ఎంతదూరమైనా వెళతారు, ఎంత టైమ్ అయినా పెడతారు.
ఇప్పుడు పదిహేను రూపాయలపైగానే చేరుకున్న చాయ్‌ను నాకు అరవై పైసల నుంచి చూసిన గుర్తు. నీలోఫర్ కేఫ్‌లో నలభై పైనే నట!
ఒక్క చాయ్ తాగకుండా గంటల తరబడి కేఫ్‌ల్లో కూర్చున్నా … ఎందుకు కూర్చున్నావు అని ఎవరూ ప్రశ్నించరు.
పైౖగా మంచినీళ్లు ఇచ్చి, ఫ్యాన్ వేసి మరీపోతారు.
మున్సిఫ్ లేదా దక్కన క్రానికల్ పేపర్ చూస్తూ,, పాత హిందీ పాటలు వింటూ, దోస్తులతో ముచ్చట్లు. పెడుతూ ప్రజలు అక్కడ గంటలతరబడి గడిపేవారు….
నా జీవితంలో ఎన్ని గంటలు కేఫ్‌ల్లో గడిచిపోయాయే లేక్కేలేదు.
నైస్ మెమొరీ…
కోయి లౌటాదే ముజే… బితే హువే దిన్….
పాత అంతా గొప్ప, కొత్త తక్కువ అని కాదు. కానీ గతాన్ని తవ్వుకోవడం ఒక ఆనందం. ‘రీ లివింగ్ ఇన్ ఓల్డ్ మెమరీస్’.
విద్యానగర్ చౌరస్థాలో ఫస్ట్ లక్కీకేఫ్ లేదు… ఏదో వెజిటబుల్ షాప్… ఆర్టీసి క్రాస్‌రోడ్ దారిలోని ‘డయానా’, శంకర్‌మఠ్ ‘మెలొడీ కేఫ్’, నల్లకుంట వెజిటబుల్ మార్కెట్లో అతి తక్కువ ధరకు చాయ్ అమ్మే ‘బ్రైట్ కేఫ్’, ‘టీ డెన్’ లేవు.
‘మూన్ కేఫ్’ మినుకుమినుకు మంటూ నడుస్తోంది. ఇక నల్లకుంట మెయిన్ రోడ్ ‘గోల్డెన్ కేఫ్’, ‘షనాన్ కేఫ్’, కోరింటిలో ‘గుల్జార్ కేఫ్’, ‘షర్టాన్ కేఫ్’ ఎప్పుడో అవుట్, దవాఖానకు మరో పక్కన ‘షైలా’ మాత్రం అలా అలా నడుస్తోంది.
శివం రోడ్లో ‘గ్రీన్లాండ్స్’, చే నెంబర్ చౌరస్తా ‘సీగల్ కేఫ్’ల నామ్ నిషానీ లేదు. ‘సీగల్’ ప్లేసులో ఏదో వెహికిల్ షోరూమ్. ప్రతీ ప్లేస్‌లో ఏవో బిజినెస్‌లు వచ్చాయి. ఒకటి అరా మిగిలినా పెద్దగా రష్ ఉన్నట్లు కనిపించలేదు.
వందలు, వేలకొద్ది ఇరానీ కేఫ్‌లు మాయవయ్యాయి.
ఇంట్లో వృద్దుల తరహాలోనే, హైదరాబాద్ స్మృతిపథం నుంచి కేఫ్‌లు సైలెంట్‌కు పక్కకు జరిగిపోయాయి.
పట్నం కన్నీరు పెడుతుందని రాయాల్నేమో గోరటి ఎంకన్న….
ఇప్పుడు హైదరాబాదంటే చార్మినార్, ఇరానీ కేఫ్‌లు కాదు, హైటెక్ సిటీనే…
గోల్డెన్ కేఫ్ మూసినప్పుడు అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఎడిటర్‌గా ఉన్న సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తిగారు తన మెమరీలతో ఒక ఎడిటోరియల్ రాసినట్లు గుర్తు.
కేఫ్‌ల తరం అంతరించి పోవడం గురించి వేరే ఎక్కడైనా ప్రస్తావనకు వచ్చిందో లేదో చదివినట్లయితే నాకు గుర్తు లేదు.