దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే, వాటితో మాకు సంబంధం లేదు…ఏపీలో మాత్రం మేము రేట్లు తగ్గించేది లేదని, గత ప్రభుత్వంలోనే రేట్లు పెంచారని జగన్ కోట్లు ఖర్చుపెట్టి మరీ ప్రకటనలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక, తాజాగా నేడు ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అయితే…వ్యాట్ కూడా తగ్గించబోమని చెబుతూ ఏకంగా కుండబద్దలు కొట్టారు.
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విషయంలో తగ్గేదే లే అంటున్న బుగ్గన….అప్పుల ఊబిలో ఉన్న ఏపీకి పెట్రోలు, డీజిల్, లిక్కర్ పై వచ్చే ఆదాయమే సంజీవని అని చెప్పేశారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం నిర్ణయంతో తమకు సంబంధం లేదని, కేంద్ర ఖర్చులు వేరు…రాష్ట్రాల ఖర్చులు వేరు అని ఎస్కేప్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అన్ని పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తానని హామీ ఇచ్చిన జగన్…దాని ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించినా ఏపీలో ఎందుకు తగ్గించరని జగన్ ను నిలదీశారు.
అనంతపురంలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం, విద్యార్థులపై దాడి చేయడం సిగ్గుచేటని చంద్రబాబు మండిపడ్డారు. ప్రశ్నించే వారు ప్రతిపక్షమైనా, ప్రజలైనా దాడులు చేయడమే జగన్ ఉద్దేశమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలదీసే విద్యార్థులకు లాఠీదెబ్బలే జవాబులా? ఇది రాక్షస రాజ్యమా? మేనమామ అంటే బతుకు కోరేవాడు అని.. ఇలా బడి మూసేవాడు కాదని జగన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.