శవాల మీద పేలాలు ఏరుకోవడం…సెటైరికల్ గా ఈ డైలాగ్ ను కొంతమందిపై ప్రయోగిస్తుంటారు. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా తమకు కావాల్సింది చేయడం, ఆ సిట్యుయేషన్ ను సొమ్ము చేసుకోవడం వంటివి చేసేవారికి ఈ డైలాగ్ వర్తిస్తుంది. తాజాగా కర్ణాటకలో స్టార్ హీరో పునీత్ మరణం నేపథ్యంలో కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్ల తీరు…శవాలపై పేలాలేరుకునే తరహాలో షాకింగ్ గా మారింది.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడ చిత్ర పరిశ్రమతో దక్షిణ భారత దేశాన్ని కలిచివేసిన సంగతి తెలిసిందే. జిమ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురైన పునీత్….చికిత్స పొందుతూ మృతిచెందడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ మరణాన్ని తట్టుకోలేని కొందరు అభిమానులు ఆత్మహత్యలకూ పాల్పడుతుంటే…మరోపక్క కొందరు కాసులకు కక్కుర్తిపడి పునీత్ మరణాన్ని కూడా ప్రమోషన్ కు వాడేసుకుంటూ శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు.
కర్ణాటకలో కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్ల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పునీత్ మృతికి సంతాపం తెలియజేసే ముసుగులో కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లు తమ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం వివాదాస్పదమైంది. పునీత్ మరణాన్ని కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు క్యాష్ చేసుకుంటున్న వైనంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. పైన పునీత్ ఫోటో పెట్టి సంతాపం తెలుపుతూనే…కింద తమ పైత్యాన్ని ప్రకటనల రూపంలో చెప్పేస్తున్న వైనం జుగుప్సాకరంగా మారింది.
పునీత్ లాగా గుండెపోటు రాకుండా ఏం చేయాలి..? పునీత్ ఎలా చనిపోయాడు..? జిమ్ లో హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటూ ఎవేర్నెస్ క్యాంప్ లంటూ తమ డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రమోట్ చేసుకుంటున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ డయాగ్నోస్టిక్స్ సెంటర్ వద్ద పునీత్ కు నివాళులర్పిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు ఉచితంగా గుండె, ఇతర చెకప్‌లు చేస్తామని, బీపీ, ఈసీజీ, కొలెస్ట్రాల్ చెకప్ రూ.300కే అని యాడ్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ వ్యవహారంపై పునీత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఓ పక్క తమ అభిమాన హీరో మరణాన్ని తాము జీర్ణించుకోలేకపోతుంటే…మరోపక్క ఆయన మరణాన్ని ఈ డయాగ్నొస్టిక్ సెంటర్లు క్యాష్ చేసుకుంటున్నాయని మండిపడుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఇంత నీచానికి దిగజారుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించడంలో తప్పు లేదని, కానీ, అవగాహన పేరుతో ప్రకటనలివ్వడం, తమ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రమోట్ చేసుకోవడంపై పునీత్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.