ఏపీలో పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. దీంతో, ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న విషయాన్ని గ్రహించిన వైసీపీ నేతలు అరాచకానికి తెగబడుతున్నారు. టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా బెదిరింపులకు దిగుతున్నారు.
కొందరు టీడీపీ అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే, కొన్ని చోట్ల రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. నామినేషన్ల విషయంలో ఆర్వోలు పద్దతిగా వ్యవహరించాలని, డ్రామాలు ఆడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వెంటాడతామని వార్నింగ్ ఇచ్చారు.
నామినేషన్లకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను ఆర్వోలు చించేసినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. అందుకే, నామినేషన్ల దాఖలుకు ముందు.. తర్వాత సోషల్ మీడియాలో నామినేషన్ పత్రాలను పెట్టాలని అభ్యర్థులకు సూచించారు. ఎన్నికలు పకడ్బంధీగా జరిగితే వైసీపీ గెలవలేదన్నారు. ఉన్మాదుల మాదిరిగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని, దొంగ ఓట్లను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్
చేశారు.
టీడీపీ కార్యాలయంపై దాడినాడు కనబరిచిన ఆవేశాన్ని స్థానిక ఎన్నికల్లోనూ కనబరిచి వీరోచితంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికలయ్యే వరకూ తాను అమరావతిలోనే ఉంటానని, అవసరమైతే ఈసీ దగ్గరకు, క్షేత్రస్థాయికీ వెళ్లి పోరాడతానని చంద్రబాబు ధైర్యం చెప్పారు. గురజాల మునిసిపాలిటీలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను లాక్కెళ్లినా పోలీసులు, అధికారులు పట్టించుకోలేదని చంద్రబాబు వీడియోలతో సహా మీడియాకు చూపించారు. ప్రజలు తిరగబడితే బట్టలు కూడా మిగలవ్.. పారిపోతారు ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు.