రాజకీయం అంటే రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం అనే సినిమా డైలాగ్ చాలా పాపులర్. అయితే, ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం అనే పదానికి కొత్త భాష్యం చెప్పారన్న విమర్శలు వస్తున్నాయి. రాక్షసంగా ప్రతిక్షాలకు కీడు చేసే యంత్రాంగమే రాజకీయం అని జగన్ కొత్త నిర్వచనం చెప్పారని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు. ఏపీలో ఫ్యాక్షన్, కక్షా రాజకీయాలకు జగన్ తెరతీశారని ఆరోపిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై విషం కక్కడమే ప్రధాన లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నారని, ప్రజావేదిక విధ్వంసం మొదలు మొన్న జరిగిన టీడీపీ కార్యాలయాలపై, పట్టాభిపై దాడి వరకు జగన్ ప్రతీకార రాజకీయాలకు మచ్చుతునకల వంటి ఉదాహరణలని మండిపడుతున్నారు. టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడులు చేసిన వారిని ఖండించాల్సిన జగన్…వారికి కోపం వచ్చి దాడి చేశారంటూ సమర్థించేలా వ్యాఖ్యానించడంతో తాను ఫ్యాక్షన్, కక్షాపూరిత రాజకీయాలను పెంచిపోషిస్తున్నానని జగన్ స్వయంగా అంగీకరించినట్లేనని చెబుతున్నారు.
ప్రతిపక్ష నేతలు కాబట్టి జగన్ పై ఆరోపణలు చేయడం సహజం అనుకునే వారు కూడా ఆలోచించేలా జగన్ వ్యవహార శైలి ఉందనడానికి తాజా ఘటనే నిదర్శనం. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తుండగా…ఆయన బస చేసే ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కి పవర్ కట్ చేయించారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు బస చేసిన గెస్ట్ హౌస్ కు పవర్ కట్ కావడంతో…అక్కడ జనరేటర్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అక్కడకు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలోనే గెస్ట్ హౌస్ కు కావాలనే పవర్ కట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, దీనిపై విద్యుత్ అధికారులు స్పందించారు. పవర్ కట్ కాలేదని, ప్రత్యామ్నాయంగా మాత్రమే జనరేటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. గెస్ట్ హౌస్‌కు విద్యుత్ లేదనేది పుకారేనని కొట్టి పారేశారు. అవాస్తవాలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ సిబ్బంది డిమాండ్ చేశారు. కాగా, గతంలో చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, అందుకే, ముందు జాగ్రత్త చర్యగా జనరేటర్‌ను సిద్ధం చేశామని విద్యుత్ సిబ్బంది తెలిపారు. ఈ వ్యవహారంలో కుప్పంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుస్తోంది.