ఈ మధ్యకాలంలో వైసీపీ నేతలు ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. తమను, తమ అధినేత జగన్ ను ఎవరైనా విమర్శిస్తే చాలు…వారిపై లేనిపోని కేసులు పెట్టడం…కస్టడీ పేరు చెప్పి పోలీసులతో కొట్టించడం….తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహారించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది. వైసీపీ నేతలకు, జగన్ కు పక్కలో బల్లెంలా మారిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ విషయంలో ఫాలో అయిన ప్యాటర్న్ లో కొద్దిగా మార్పులు చేసి టీడీపీ నేత పట్టాభి విషయంలోను ఫాలో అవ్వాలని వైసీపీ నేతలు స్కెచ్ వేశారని ఆరోపణలు వస్తున్నాయి.
పట్టాభిని కూడా తనను కొట్టినట్టే పోలీసులు కొట్టారని, కోర్టు నుంచి మచిలీపట్నం జైలుకు తీసుకువెళ్లే క్రమంలో పట్టాభిపై పోలీసులు దాడి చేశారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ విచారణపై ఉత్కంఠ ఏర్పడింది. అయితే, తాజాగా పట్టాభికి ఊరట కలిగిస్తూ పోలీసులు వేసిన పిటిషన్ ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.
పట్టాభికి ఆల్రెడీ హైకోర్టు బెయిల్ ఇచ్చిందని, ఇప్పుడు కస్టడీకి ఇవ్వాలని కోరడం సరికాదని పట్టాభి తరఫు న్యాయవాది లక్ష్మినారాయణ వాదనలు వినిపించారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు జగన్ ను ఉద్దేశించి చేసినవి కాదని లక్ష్మినారాయణ వాదించారు. కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను కొట్టివేసింది.
కాగా, జగన్ ను దూషించారన్న ఆరోపణలతో పట్టాభిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పట్టాభికి విజయవాడ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు నవంబర్ 2 వరకు రిమాండ్ విధించింది. కానీ, ఆ తర్వాత పట్టాభి తరఫు న్యాయవాదులు పట్టాభికి బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు…పట్టాబికి బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే పట్టాభిని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ ను విజయవాడ కోర్టు డిస్మిస్ చేసింది.