ఆర్థిక సమస్యలతో తీవ్రస్థాయిలో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి గోరుచుట్టుపై రోకలి పోటు మాదిరి గా.. ఎప్పుడో వైఎస్ హయాలో చేసుకున్న ఒప్పందం.. తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో రస్ అల్ ఖైమాకు రూ.600 కోట్ల పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుందనే హెచ్చరికలు ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నా యి.
ఈ `పరిహారం` నుంచి తప్పించుకునేందుకు ఏపీ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆద్యంత ఆసక్తిగా.. అనేక మలుపులు తిరుగుతున్న ఈ ఉదంతం.. వివరాలు ఇవీ..!
వైఎస్ రాజశేఖరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు..2007లో పెన్నా గ్రూప్, రస్ అల్ ఖైమాకి చెందిన రాకియా సంస్థ సంయుక్తంగా అన్‌రాక్ అల్యూమినియం లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. తొలుత ఇందులో పెన్నా గ్రూప్ వాటా 70శాతం, రాకియా వాటా 30శాతం ఉండేది.
2012-13లో పెన్నా గ్రూప్ వాటా 87శాతం, రాకియా వాటా 13శాతంగా మార్పులు చేశారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లిలో అన్‌రాక్ పరిశ్రమ ఏర్పాటు చేసింది. అక్కడి ఏజెన్సీ ప్రాంతంలో ఏపీఎండీసీకి కేటాయించిన బాక్సైట్ లీజుల నుంచి ఖనిజాన్ని అన్‌రాక్‌కు సరఫరా చేయాల్సి ఉంది.
తొలుత దీనికి వైఎస్ హయాంలో అనుమతులు మంజూరయ్యాయి. అయితే బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరగడంతో గత ప్రభుత్వం 2016లో అన్‌రాక్, ఏపీఎండీసీకి మధ్య ఉన్న బాక్సైట్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా బాక్సైట్ లీజులను రద్దు చేస్తూ 2019లో ఉత్తర్వులిచ్చింది.
దీంతో పెట్టుబడి నష్టపోయామంటూ రాకియా సంస్థ అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రూ. ఆరు వందల కోట్లను పరిహారంగా చెల్లించాలని రస్ అల్ ఖైమా ఇన్వెస్టిమెంట్ అధారిటి ..రాకియా డిమాండ్ చేస్తోంది.
అయితే.. ఇప్పుడు ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితిలో ఇంత మొత్తం(600 కోట్లు) ఇచ్చేందుకు సర్కారు రెడీగా లేదు. పైగా ఇది ప్రస్టేజ్ ఇష్యూ కావడంతో దీనిపై మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. నవంబర్ 15న మరోమారు అంతర్జాతీయ అర్బిట్రేషన్ ప్రక్రియతో పాటు మధ్యవర్తిత్వం కోసం కృషి చేస్తోంది.
దీనికి సంబంధించి గనుల శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ సహా ఇతర ఉన్నతాధికారులు లండన్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో తాము బాక్సైట్‌ను సరఫరా చేయలేక పోయినా.. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ ల నుంచి బాక్సైటు ఖనిజాన్ని సరఫరా చేయించే దిశగా ఒప్పందంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా రూ.600 కోట్ల పరిహారం నుంచి తప్పించుకోవచ్చని ఏపీ భావిస్తోంది.
ఇదిలావుంటే.. రాకియా సంస్థ.. ఈ వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. జగన్ వ్యాపారాల భాగస్వామిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన సంస్థలు కూడా రస్ అల్ ఖైమా నుంచి పెట్టుబడులు తీసుకున్నాయి. వాటిలో కొన్ని జగన్ సంస్థల్లోకి పెట్టుబడులుగా మళ్లించారు. ఇవన్నీ క్విడ్ ప్రో కో అని సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసింది.
రెండేళ్ల కిందట నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనపై ఇంటర్ పోల్ నోటీసు జారీ చేయించిన రస్ అల్ ఖైమా..ఆయనను అరెస్ట్ చేయించింది. ఇక, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి నష్టప రిహారం దక్కించుకునేలా వ్యవహరిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలుఫలిస్తాయా? లేదా? అనేది చూడాలి.