తెలంగాణ మంత్రి, యువ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు.. కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఫీల్గుడ్లా ఉండే ఆయనకు డ్రగ్స్‌కు లింకేటి? మరీ ముఖ్యంగా టాలీవుడ్, డ్రగ్స్ కేసుతో ఆయనకు ఉన్న సంబంధాలు ఏంటి? ఇవీ.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలనే కాదు.. మేధావి వర్గాలను కూడా కుదిపేస్తున్న ప్రశ్నలు.
వాస్తవానికి ఇప్పటి వరకు మద్యం విషయంలో కానీ.. పొగతాగే విషయంలో కానీ… సీఎం కేసీఆర్‌పై విపక్షాలు విమర్శలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. ఎవరూ.. కూడా ఎప్పుడూ.. మంత్రి కేటీఆర్‌ను ఈ యాంగిల్లో కామెంట్లు చేసిన పరిస్థితి లేదు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా.. కేటీఆర్‌పై ఏకంగా.. డ్రగ్స్ ఆరోపణలు రావడం.. ఆయన కూడా అంతే తీవ్రంగా రియాక్ట్ కావడం.. చర్చకు దారితీసింది.
విషయంలోకి వెళ్తే.. 2018లో తెలంగాణలో డ్రగ్స్ కేసుల కలకలం రేగింది. దీంతో ప్రభుత్వం అకున్ సబర్వాల్ నేతృత్వంలో సీఐడీకి ఈ కేసులను అప్పగించి.. విచారణ జరిపింది. దీంతో టాలీవుడ్‌కు ఈ డ్రగ్స్‌కు సంబంధాలు ఉన్నాయని.. పేర్కొంటూ.. అప్పట్లోనే అకున్ సబర్వాల.. కీలక నటులను, నటీమణులను విచారించారు. అయితే.. ఏమైందోఏమో.. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణ అనూహ్యంగా నిలిచిపోయింది.
ఇక, ఇటీవల మళ్లీ ఈడీ డ్రగ్స్‌లో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్, ముమైత్ ఖాన్.. దగ్గుబాటి రానా.. ఇలా పలువురు కీలక నటులు, దర్శకులు. నటీమణులను గంటల కొద్దీ విచారించింది. కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీసింది. ఇదిలావుంటే.. ఈ విషయంలో జోక్యం చేసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర సారథి.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు.
వాస్తవానికి రేవంత్ రాజకీయాలు వరకు పరిమితం అవుతారని అనుకుంటే.. ఆయన డ్రగ్స్ విషయంపై స్పందించారు. తాను రాసిన లేఖ కారణంగానే తాజాగా ఈడీ దర్యాప్తు జరుగుతోందని అన్న రేవంత్.. ఈ సమయంలో మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావించారు.
“గత నాలుగైదు నెలలుగా కేటీఆర్ చాలా ఆందోళనలో ఉన్నారు.. బయటకు కూడా రాలేదు. ఎందుకంటే ఈ మధ్యనే ఆయన గోవాకి పోయి వచ్చాడు. ఆయన గోవాకి ఎందుకు పోయాడు.. ఎందుకు ఆందోళనగా ఉన్నాడు.? ఆయన సహచరులకు.. అత్యంత సన్నిహితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ తీగ లాగితే ఏం డొంక కదులుతుందో త్వరలోనే తెలుస్తుంది“ అని రేవంత్ కామెంట్ చేశారు.ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం బదులు డ్రగ్స్ దుమారం రేపాయి.
అంతేకాదు.. “ఈ సందర్భంగా అందరికీ తెలియాల్సింది ఏంటంటే.. నేను(రేవంత్) హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజనా వాజ్యం వేసినందుకే ఈ నోటీసులు వచ్చాయి. ఆనాడు అకున్ సబర్వాల్‌ని అధికారిగా నియమించి.. విచారణ జరిపించి కొంతమంది పిలిచి కొంతమందిని వదిలేశారు. ఎందుకంటే.. ఈ విచారణలో ప్రముఖుల పేర్లు.. కేటీఆర్ సన్నిహితుల పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో కేసుని తొక్కిపెట్టారు.. అకున్ సబర్వాల్‌ని బదిలీ చేశారు“ అని రేవంత్ మరో బాంబు పేల్చారు.
దీంతో అన్ని వేళ్లూ.. కేటీఆర్ వైపు చూపించినట్టు అయింది. అంటే.. రేవంత్ ఉద్దేశం.. కేటీఆర్‌కు డ్రగ్స్‌కు సంబంధాలు ఉన్నాయని.. ఆయన గోవాకు వెళ్లేది.. డ్రగ్స్ కోసమేనని.. పెద్ద ఎత్తున సోషల్ మీడియా కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేశారు.
ఈ క్రమంలో దీనిపై స్పందించిన కేటీఆర్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘డ్రగ్స్‌తో నాకేంటి సంబంధం!? ఎవరెవరో ఏదో మాట్లాడితే నాకు అంటగడతారా? నాకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందంటూ ఒకాయన విమర్శిస్తున్నారు. ఇంతకూ ఆయన మనిషేనా!? నేను ఏ పరీక్షకైనా సిద్ధం.
నా రక్తం, నా వెంట్రుకలు ఇస్త. నా లివర్ ముక్క కోస్కుని పరీక్ష చేయించండి. మరి, మీ రాహుల్ గాంధీని రక్త పరీక్షకు, వెంట్రుకల పరీక్షకు తీసుకొస్తారా!? నా మీద ఆరోపణలు చేయడమే కాకుండా ఈడీకి లేఖ ఇచ్చిన వ్యక్తి నిజంగా బఫూన్’’ అని మంత్రి కేటీఆర్.. రేవంత్‌పై కామెంట్లు కుమ్మరించారు.
అంతేకాదు, ‘‘రాజకీయాలు ఇంత దరిద్రమా? ఆయన చీఫా..? చీపా..? చిల్లర మాటల్ని మేం భరించాల్నా!?’’ అని మండిపడ్డారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి పట్టని కొందరు విపక్ష నాయకులు ఏకంగా సీఎంనే విమర్శిస్తున్నారు. ఆయన్ను తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ అంటున్న వ్యక్తి తాగుతలేడా? సీఎం వల్లే మద్యం అమ్మకాలు పెరిగినయా?’’ అని ధ్వజమెత్తారు.
అయితే.. నిజానికి కేటీఆర్‌పై వచ్చినవి రాజకీయ ఆరోపణలేనా? లేక నిజమేనా? అనేది.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేస్తున్న చర్చ. డ్రగ్స్ కేంద్రంగా ఇప్పుడు టీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.