అన్నీసార్లు మొండితనం పనికిరాదు. ఎందుకంటే గుడ్డిగా వెళితే ముక్కు పగులుతుందంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే ముందే అనుకున్నట్లు కచ్చితంగా ముక్కు పగలటం ఖాయం. ఇపుడిదంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిని తెలుసుకునేందుకే. పోలీసు కంప్లైట్స్ అథారిటి ఛైర్మన్ గా జస్టిస్ కనగరాజు నియామకాన్ని హైకోర్టు కొట్టేసింది. దాదాపు ఏడాది క్రిందట తమిళనాడుకు చెందిన రిటైర్డ్ జస్టిస్ కనగరాజును జగన్ ప్రభుత్వం అథారిటి ఛైర్మన్ గా నియమించింది.
నియామకం జరిగేటపుడే కనగరాజు నియామకం నిలిచేది కాదన్న విషయంపై కొందరు అనుమానం వ్యక్తంచేశారు. దీనికి తగ్గట్లే ఈ నియామకంపై కొందరు కోర్టులో పిటీషన్ వేశారు. పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సదరు నియామకాన్ని కొట్టేసింది. అథారిటి ఛైర్మన్ గా నియమితులయ్యే వ్యక్తి వయసు 65 ఏళ్ళు మించకూడదని నిబంధనల్లో ఉందట. నియామకం నాటికే ఛైర్మన్ కు 76 ఏళ్ళు. మరి ఈ విషయం ఉన్నతాధికారులకు తెలీదా ? తెలిసీ సీఎంకు చెప్పలేదా ?
ఒకవేళ ఉన్నతాధికారులు చెప్పినా జగన్ పట్టించుకోలేదా ? అంటే మూడు అనుమానాల్లో మూడో అనుమానానికే ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ అనేవ్యక్తి చాలా మొండివాడు. తాను ఏమనుకుంటే అది జరిగితీరాల్సిందే అనుకునే వ్యక్తి. మొండితనమే జగన్ బలము, బలహీనత కూడా. అయితే ఆ మొండితనం అన్నిసార్లు పనికిరాదన్న విషయం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.
గతంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించిన విషయంలో కూడా జగన్ నిర్ణయం తప్పని తేలింది. కమీషనర్ ను నియమించటం వరకే ప్రభుత్వం బాధ్యత కానీ తీసేసే అవకాశంలేదు. ఈ విషయంలో మొండిగా వ్యవహరించటంతో ప్రభుత్వం అబాసుపాలైంది. అప్పుడు కూడా నిమ్మగడ్డ రీప్లేస్మెంటుగా కనగరాజునే నియమించారు. అప్పుడు కూడా కనగరాజు నియామకం చెల్లదని కోర్టు చెప్పింది. దీంతో, ఈ వ్యవహారం జగన్ కు చెలగాటం…కనగరాజ్ కు పదవి సంకటంగా మారింది.
మళ్ళీ రెండోసారి కూడా కనగరాజు నియామకాన్ని కోర్టు కొట్టేసింది. మొండితనం ప్రభుత్వ వ్యవహారాల్లో కాకుండా పార్టీ వ్యవహారాల్లో చెల్లుతుంది. ప్రభుత్వం తరపున ఎవరినైనా నియమించేటపుడు సదరు నిర్ణయం న్యాయసమీక్షకు నిలుస్తుందా అనేది ముందుగా చూసుకుంటే ప్రభుత్వం పరువు నిలుస్తుంది. లేకపోతే ప్రతిసారి కోర్టుల ముందు అబాసుపాలవుతునే ఉంటుందని గ్రహించాలి.