ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణపై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలంటూ విపక్షాలు పట్టుబడుతుండగా….అధికార టీఆర్ఎస్ మాత్రం దానికి సిద్ధంగా లేదు. ఇక, తెలంగాణలో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాల్సిందేనని బీజేపీ చీఫ్ బండి సంజయ్ పట్టుబట్టారు.
అంతేకాదు, ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి, బీజేపీ కింగ్ పిన్ లలో ఒకరైన అమిత్ షాను తెలంగాణ బీజేపీ నేతలు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఫైర్ బ్రాండ్ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేతకాని దద్దమ్మ అని అరుణ చేసిన షాకింగ్ కామెంట్లు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి.
గద్వాల్ జిల్లా అభివృద్ధిపై కేటీఆర్‌తో చర్చకు తాను సిద్దమని డీకే అరుణ సవాల్ విసిరారు. కేటీఆర్ కాదు..కేంద్ర నిధులపై కేసీఆర్ రాజీనామా చేయాలని కూడా అరుణ డిమాండ్ చేయడం ప్రకంపనలు రేపుతోంది. అబద్దాలుకు మారుపేరుగా కల్వకుంట్ల కుటుంబం మారిందని డీకే అరుణ ఎద్దేవా చేశారు. తనపై విమర్శలు చేసేంత సమర్థత కేటీఆర్‌కు లేదని అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా సీఎంలకు ఇచ్చినట్లే కేసీఆర్ కు కేంద్రం పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చారని అన్నారు.
సెప్టెంబరు 17న నిర్మల్ లో అమిత్ షా సభ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అరుణ అన్నారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు సెప్టెంబర్ 17 చరిత్ర తెలియకపోవటం హాస్యాస్పదమని అరుణ ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించే వరకు బీజేపీ పోరాడుతోందని అరుణ పేర్కొన్నారు. మరి, అరుణ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.