హైదరాబాద్ లోని ‘‘జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్’’ అన్నది ఒకటి ఉందని.. దాని పాలక మండలి ఎన్నికలు ఒక పెద్ద వార్తగా ఎందుకు మారాయి? చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రధాన మీడియా మొదలు అన్ని మీడియా సంస్థలు ఈ బుజ్జి వార్తను కవర్ చేసేందుకు విపరీతమైన ప్రాధాన్యతను ఇచ్చాయి? చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉన్న ఈ సొసైటీ ఎన్నికల వ్యవహారం మీడియా ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చింది? ఇంతకూ జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
ఈ సెంటర్ లో మొత్తం 3181 ఓట్లు ఉంటాయి. ఇందులో సినీ ప్రముఖులతో పాటు.. సెలబ్రిటీలు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉంటారు. ఈ సెంటర్ కు ముందు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు జరిగాయి గుర్తుందా? ఆ ఎన్నికలకు ఈ ఎన్నికలకు లింకు ఉంది. ఆ ఎన్నికల్లో తెలుగులో రెండు ప్రముఖ చానళ్లు ఎన్ టీవీ.. టీవీ5 యజమానులు పట్టు కోసం పోరాడారు. చివరకు టీవీ 5 అధినేత వర్గం విజయం సాధించింది. ఈ విజయం కోసం కొన్నేళ్లుగా ఆయన ప్రయత్నిస్తున్నారు. నరేంద్ర చౌదరి ప్యానెల్ అక్కడ పరాజయం పాలయ్యింది.
ఎప్పుడైతే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో పట్టు కోల్పోయారో దానికి అనుబంధంగా ఉన్నట్లు చెప్పే జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ మీద పట్టు పెంచుకోవటానికి ఎన్ టీవీ అధినేత మరోసారి రంగంలోకి దిగారు. ఈసారి ఆయన అనుకున్నట్లు విజయం సాధించారు. తన ప్యానల్ గా బరిలోకి దిగిన వారంతా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో పాలక మండలి పదవులు అన్ని ఏకగ్రీవం అయ్యాయి. సొసైటీ అధ్యక్షులుగా సి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షురాలిగా ఎ.హిమబిందు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా టి.హనుమంతరావు, సంయుక్త కార్యదర్శిగా ఎం.జనార్దన్ రెడ్డి ఎన్నికయ్యారు. పాలకమండలి సభ్యులుగా అమితారెడ్డి, తిరుపతిరావు, రమేశ్ చౌదరి, కిలారు రాజేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, వెంకటసోమరాజు, అశోక్ రావు, శివప్రసాద్, జగ్గారావు, రవీంద్రనాథ్, సుభాష్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు టి.నరేంద్ర చౌదరి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
తాజాగా ఎన్నికైన ఈ కొత్త పాలకమండలి రెండేళ్ల పాటు కొనసాగనుంది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ నూతన కార్యవర్గం ఈ నెల 19న తొలిసారిగా భేటీ కానుంది. ఈ సొసైటీకి సంబంధించిన ఇష్యూలు కొన్ని గతంలో ఉన్నాయి. ఓపక్క ఈ రచ్చ సాగుతున్న వేళలోనే.. సొసైటీ ఎన్నికల్ని నిర్వహించటంతో.. కొత్త కార్యవర్గం అందరికి తెలియాలన్నతపన కూడా చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరికి తెలిసేందుకు వీలుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారని చెప్పాలి.
రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ.. తాను పుట్టిన ఊళ్లో పట్టు ఉండటం అనేది ముఖ్యం. అలాగే … పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వారు సైతం.. తాము టార్గెట్ చేసిన సొసైటీ ఎన్నికల్లో ఏకగ్రీవం కావటంతో ఆ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవటానికి ఆసక్తిని చూపిస్తున్నారని చెప్పక తప్పదు.